భద్రాచలం: అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, తద్వారా పనుల్లో వేగం పెరగడమే కాక పారదర్శకత ఉంటుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వెల్లడించారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో కృత్రిమ మేధస్సు(ఏఐ) వినియోగంపై అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారిక లేఖలు, నివేదికలు, డేటా విశ్లేషణ, సమాచార సేకరణలో చాట్ జీపీటీ తదితర ఏఐ సాధనాల వినియోగంతో సమయం ఆదా అవుతుందని తెలిపారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే పౌరులు ఆత్మగౌరవంతో జీవిస్తూ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతున్నారని తెలిపారు. ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఎస్‌డీసీ ఆనంద్‌కుమార్, ఈఈ మధుకర్, ఏపీఓ వేణు, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, పీవీటీజీ అధికారి గన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల మాక్ అసెంబ్లీ
భద్రాచలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. విద్యార్థులు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ పాత్రలు పోషిస్తూ సభా నిర్వహణ, ప్రశ్నోత్తరాలు, ప్రజా సమస్యలపై చర్చలు జరిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా, ఆర్టీసీ ఉద్యోగుల భద్రత వంటి అంశాలను సభలో ప్రస్తావించి అధికారపక్షం, ప్రతిపక్షం పాత్రలను సమర్థవంతంగా ప్రదర్శించారు. మాక్ అసెంబ్లీని వీక్షించిన పీఓ రాహుల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు మాక్ అసెంబ్లీ కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఏటీడీఓ రాధమ్మ, హెచ్‌ఎం సాయన్న పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


