● 80 అడుగుల ప్రతిపాదనకు లాబీయింగ్ అడ్డంకులు? ● రోడ్డు వెడల్పు 45 అడుగులకే పరిమితం చేసే ప్రయత్నాలు ● ఓ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా ఒత్తిళ్లు! ● భద్రాచలంలో గోదావరి పుష్కరాలకు మళ్లీ ట్రాఫిక్ కష్టాలేనా..
భద్రాచలం: గోదావరి పుష్కరాలకు భద్రగిరికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. భద్రగిరిలో జూన్–2027లో జరిగే పుష్కరాలకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగినట్లు, గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రణాళికలను రూపొందించారు. ఈ క్రమంలోనే బ్రిడ్జి రోడ్డులో ఉన్న అభయాంజనేయస్వామి పార్కు వద్ద నుంచి సరాసరి విస్తా కాంప్లెక్స్ మీదుగా కూనవరం రోడ్డుకు కలిపేలా రోడ్డు విస్తరణకు ప్రతిపాదించారు. ప్రస్తుతం సుమారు 25 అడుగులుగా ఉన్న రోడ్డును 80 అడుగులకు విస్తరించాలని భావించారు. నివేదికను సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను సబ్ కలెక్టర్, కలెక్టర్, మంత్రులు సైతం ఆదేశించారు. ఈ విస్తరణలో అనేక ప్రైవేట్ లాడ్జీలు, ఓ వర్గానికి చెందిన సేవా సమితి సత్రం సైతం కొంత మేర కోల్పోయే స్థితి ఉంది.
గ్రామసభలో ఆమోదించేలా అంతర్గత ఒప్పందం?
ఇటీవల పెద్ద పెద్ద గదులతో నిర్మించిన సత్రానికి చెందిన పెద్దలు చకచకా పావులు కదిపారని సమాచారం. ఆ సత్రంలో కొద్ది మేర గదులతోపాటు విలువైన స్థలం కూడా కోల్పోయే అవకాశం ఉండటంతో తమ వర్గానికి చెందిన ఓ మంత్రిని ఆశ్రయించినట్లు సమాచారం. భక్తులకు, భద్రగిరి అభివృద్ధికి ఎల్లప్పుడు వెన్నంటి అండగా నిలిచే ఆ మంత్రి తొలుత వీరి ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే సదరు వర్గానికి చెందిన పెద్ద తలకాయలు రంగ ప్రవేశం చేసి ఒత్తిడి చేయటంతో 80 అడుగుల నుంచి 65 అడుగులకు ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయినా సంతృప్తి చెందని ఆ వర్గం నాయకులు మంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించి రోడ్డు విస్తరణను 45 అడుగులకు పరిమితమయ్యే విధంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గ్రామసభలో ఆమోదించేలా అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
భక్తులు, స్థానికుల్లో ఆగ్రహం
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి బ్రిడ్జి సెంటర్, గోదావరి ఒడ్డున నుంచి వెళ్లేందుకు ఈ రోడ్డును ఎక్కువగా భక్తులు ఆశ్రయిస్తుంటారు. ముక్కోటి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వినాయక నిమజ్జనం రోజుల్లో కిక్కిరిసిపోతోంది. అటువంటి రోడ్డును 80 అడుగులకు విస్తరిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు చేసి మొక్కలు నాటితే ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనాలు సరాసరి కూనవరం రోడ్డుకు వెళ్లేందుకు వన్‌వే లా కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా రోడ్డు విస్తరణను కుదించటంపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాబీయింగ్, ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన కరకట్ట దిగువన ఉన్న రోడ్డు 80 అడుగుల విస్తరణకే కట్టుబడి ఉండాలి. భక్తుల ఆక్షాంక్షలకు వ్యతిరేకంగా, అభివృద్ధికి ఆటంకంగా మారితే భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోతారు. గోదావరి పుష్కరాల నాటికి రోడ్డు విస్తరణ పూర్తి చేయాలి.
–పూనెం ప్రదీప్ కుమార్,
స్థానికుడు


