ఇప్పుడిప్పుడే రామాలయ అభివృద్ధి పనులు
● జిల్లా ఆవిర్భవించి నేటికి పదేళ్లు పూర్తి ● 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాగా ఏర్పాటు ● దశాబ్దకాలంలో పలు రంగాల్లో ముందంజ ● సీతారామ నిర్మిస్తున్నా తప్పని సాగునీటి తిప్పలు
మెడికల్ కాలేజీ
2022–23 విద్యాసంవత్సరంలో కొత్తగూడెంలో వైద్య కళాశాల, అనుబంధంగా బోధనాస్పత్రి, నర్సింగ్ కాలేజీలు మంజూరయ్యాయి. పాలన పరమైన పర్యవేక్షణ పెరగడంతో వైద్య విధాన పరిషత్ (సెంకడరీ హెల్త్)లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. కొత్తగూడెం, భద్రాచలం ఆస్పత్రులకు దీటుగా పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట, చర్ల ఆస్పత్రుల్లో వైద్య సేవలందుతున్నాయి. ట్రామా కేర్ సెంటర్ కూడా నిర్మించారు. కేన్సర్ ఆస్పత్రి కూడా మంజూరైంది. ప్రైమరీ హెల్త్ విభాగంలోనే ఖాళీల కొరత పట్టి పీడిస్తోంది. జిల్లా యూనిట్ కావడంతో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు కూడా మంజూరయ్యాయి. గతంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేశారు.
పారిశ్రామిక రంగంలో మిశ్రమ ఫలితాలు
స్థానికంగా ఉన్న వనరులు, అవకాశాలతో గడిచిన పదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగం పురోగతిని బేరీజు వేస్తే మిశ్రమ ఫలితాలు వచ్చాయని పేర్కొనవచ్చు. మణుగూరులో 1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం రావడం ఒక్కటే సానుకూల అంశం. మరోవైపు కేటీపీఎస్ పరిధిలో ఆరంభంలో ఉన్న ఓ అండ్ ఎం విభాగంలో నాలుగు యూనిట్లు మూతపడ్డాయి. ఇక్కడ విస్తరణ జరగలేదు. మరో భారీ పరిశ్రమగా చెప్పుకునే స్పాంజ్ ఐరన్ కర్మాగారం ఎన్‌ఎండీసీ చేతిలోకి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఏపీ స్టీల్స్‌ది ఇదే పరిస్థితి. ఆఖరికి సింగరేణి పరిధిలో కొత్త గనులకు ఇదే దుస్థితి దాపురించింది. కోయగూడెం మినహాయిస్తే ఇల్లెందు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లేదు. కొత్తగూడెం పరిస్థితి నామ్ కే వాస్తే అన్నట్టుగా ఉంది. ప్రైవేట్ సెక్టార్‌లో కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న ఐటీసీ–పేపర్‌బోర్డ్ విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క అప్పారావుపేట ఆయిల్ ఫ్యాక్టరీ క్రషింగ్‌లో రికార్డుల మోత మోగిస్తూ రాష్ట్ర సర్కారు దృష్టిని ఆకర్షిస్తోంది.
సరిహద్దు చిక్కులు
కొత్త జిల్లా ఏర్పాటుతోనే కొత్త మండలాలు, పోలీస్ స్టేషన్లు వచ్చాయి. ఆరో పోలీస్ పటాలం కూడా వచ్చింది. దీంతో ఖాళీల సంఖ్య పెరగడంతో శాంతి భద్రత నిర్వహణలో గతంలో పోలిస్తే పరిస్థితులు మెరుగయ్యాయి. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల ప్రభావం జిల్లాపై పదేళ్లపాటు తీవ్రంగా చూపినా, ఇటీవల ఆ సమస్య కూడా తీరిపోయింది. కొత్తగా పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి, పశువుల అక్రమ రవాణాతో పోలీసులకు సవాల్ ఎదురవుతోంది. ఒకప్పుడు తండాల్లో, పల్లెల్లో పారిన గుడుంబా కొత్త జిల్లాగా ఏర్పాటైన తర్వాత దాదాపుగా కనుమరుగైంది. ఇప్పటికీ జిల్లా జైలు లేకపోవడం కొరతగానే ఉంది.
జాతీయ రహదారి మంజూరు
జిల్లా మీదుగా హైదరాబాద్–భద్రాచలం జాతీయ రహదారి 930పీ మంజూరు కావడంతో రాష్ట్ర రాజధానికి దగ్గరి దారి అందుబాటులోకి వచ్చింది. బస్‌డిపోతో ఇల్లెందు కేంద్రంగా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. రైల్వే పరంగా కొత్తగా మంజూరైన బెళగావి/కొల్హాపూర్ రైలు కొన్నాళ్లు నడిచి రద్దయింది. భద్రాచలంరోడ్ – సత్తుపల్లి లైను ప్రారంభం అవగా భద్రాచలం–మల్కన్‌గిరి లైన్ నిర్మాణ పనులు మొదలయ్యాయి.
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం ఏజెన్సీ కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలో నష్టపోయింది. ఆరు మండలాలు ఏపీకి పోవడం ఈ ప్రాంత అభివృద్ధికి గొడ్డలి పెట్టులా మారింది. ఆలయ అభివృద్ధికి ఇస్తామన్న రూ.100 కోట్లు ఎండమావిగానే మారింది. భద్రాద్రి పేరుతో జిల్లా ఏర్పాటైన తొమ్మిదేళ్ల తర్వాత ఆలయం అభివృద్ధి పనులు పట్టాలెక్కాయి. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఆలయంతోపాటు గోదావరి ఫుష్కర ఘాట్ల దగ్గర రూ.586 కోట్లతో పనులు మొదలయ్యాయి.


