వైభవంగా నిర్వహిస్తాం
● నేటి నుంచి శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ● విద్యుత్‌దీపాలతో శోభిల్లుతున్న పెద్దమ్మతల్లి ఆలయం ● ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. రోజూ సహస్ర నామార్చన, కుంకుమార్చన, చంఢీహోమం, శ్రీచక్రార్చన, ఇతర హోమాలు, దర్బారు సేవ, అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు తదితర పూజలు నిర్వహించనున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు క్యూలైన్లు, నీరు, నీడ ఉండేలా చర్యలు చేపట్టారు.
భక్తిశ్రద్ధలతో పూజలు
భక్తుల కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీశరన్నవరాత్రుల మహోత్సవాలకు వేళైంది. ఏటా దసరా పండగకు ముందు ఆలయంలో వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో పూజలు జరుపుతారు.
కలశస్థాపనతో ప్రారంభం
నేటి ఉదయం 11.10 గంటలకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దంపతుల కలశస్థాపనతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, అఖండ దీపారాధన, దీక్షాధారణ నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి ప్రత్యేకంగా వేదపండితులను తీసుకొచ్చి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహింపజేస్తారు.
ముస్తాబైన ఆలయం
మహోత్సవాలకు పెద్దమ్మతల్లి ఆలయం ముస్తాబైంది. విద్యుత్‌దీపాల అలంకరణతో శోభిల్లుతోంది. ఆలయానికి రంగులు వేసి తీర్చిదిద్దారు. జిల్లా వ్యాప్తంగా వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఆలయం చుట్టూ లైటింగ్, పాల్వంచ పట్టణం వరకు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. శరన్నవరాత్రి వేడుకల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. నవరాత్రి వేడుకలు జరిగే రోజుల్లో ఆలయ ప్రాగంణం భక్తులతో కిటకిటలాడనుంది.
ఆలయంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తొమ్మిది రోజులపాటు శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవా లు నిర్వహిస్తాం. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశాం. చివరిరోజు సామూహిక రమాసహిత సత్యనారాయణ వ్రత పూజలు జరుపుతాం. దసరా రోజు కోనేరులో తెప్పోత్సవం, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం.
–ఎ.విజయ్‌కుమార్, పెద్దమ్మగుడి ఈఓ


