రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
అశ్వారావుపేటరూరల్: క్రీడా రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం అశ్వారావుపేట మినీ స్టేడియంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి రాష్ట్ర స్థాయి అండర్–20 బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించారు. తొలుత పోలీస్ స్టేషన్ సెంటర్‌లో రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.23.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. రింగ్ రోడ్ సెంటర్ నుంచి మినీ స్టేడియం వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు, మహిళలతో కలిసి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు ప్రణాళిక, ఎంతో కృషి అవసరమన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


