ఖర్చు, శ్రమ తక్కువ.. ఆదాయం ఎక్కువ
వరి, పత్తి, మిర్చి పంటలకు యూరియా, పురుగు మందులు వాడకంతో పెట్టుబడి పెరుగుతోంది. పంటపై రసాయనాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయి. వరికి సైతం అధిక స్థాయిలో నీరు, విద్యుత్ కావాలి. అదే పామాయిల్ అయితే ఆ ఇబ్బందులు ఉండవు. చెట్టు మొదలు దగ్గర నింతరం తేమ ఉంచే స్థాయిలో నీరు అందిస్తే చాలు. పురుగుల మందులు, ఎరువుల అవసరంలేదు. విద్యుత్ వాడకం కూడా తక్కువే. వరి, పత్తి, మిర్చితో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో నాలుగింతల ఆదాయం పొందవచ్చు. అంతేకాక పామాయిల్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యాన ఎలాంటి నష్టాలు రావు. పంట దిగుబడి మొదలయ్యే వరకు కోకో, మిరియాలు, వక్కలు, దాల్చిన వంటి అంతర పంటల ద్వారా ఏటా కనిష్టంగా రూ.50 వేల రాబడి ఉంటుంది. ఆ తర్వాత తేనెటీగలు, పట్టు పురుగుల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చు.
వాటాల్లో మార్పులపై పరిశీలన
పామాయిల్ రైతులకు మరింత ప్రోత్సాహం అందించాల్సి కేంద్రం.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు 40 శాతానికి పైగా ఉన్న దిగుమతి సుంకాన్ని 11.5 శాతానికి తగ్గించింది. తద్వారా ధరల్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి. ఈక్రమాన రైతులు ఇబ్బంది పడకుండా మినిమమ్ గ్యారంటీ ప్రైస్(ఎంజీపీ) అమలు చేయాలి. ఇందుకోసం ప్రతీ ఎకరాకు రూ.25 వేలు ఇవ్వగలిగేలా వయబులిటీ గ్యాప్ ఫండ్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక రాష్ట్రం విషయానికి వస్తే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిపై వచ్చిన లాభంలో రైతుల, ఆయిల్‌ఫెడ్ 75 – 25 శాతం తీసుకుంటున్నాయి. దీన్ని 80 20 నిష్పత్తికి మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. అలాగే, గెలల రవాణా విషయంలో అవకతవకలను నివారించేందుకు ఆన్‌లైన్ విధానం, ‘ఎఫ్ కోడ్’ విషయంలో మార్పులు చేయబోతున్నాం.
వెదురు కూడా బాగు...
మార్కెట్‌లో పామాయిల్ కంటే వెదురుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో పట్టా ఉన్న పోడు భూముల్లో వెదురు సాగు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సైతం యూకలిప్టస్ బదులు వెదురును ప్రోత్సహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలకు డిమాండ్ ఉన్నా ఆ స్థాయిలో సాగు లేదు. ఈ అంశాల్లో మా శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
20 శాతానికి పైగా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్)తో దేశంలోనే నంబర్ వన్‌గా అప్పారావుపేట ఫ్యాక్టరీ ఉంది. గెలలు కోసిన 24 గంటల్లోగా ఫ్యాక్టరీకి తరలించడం, అక్కడ సమర్థంగా క్రషింగ్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని పామాయిల్ సాగు విస్తీర్ణం పెరిగిన చోట 24 గంటల్లో ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్‌బీబీ) చేరేలా కొత్తగా 14 ఫ్యాక్టరీలు నెలకొల్పుతున్నాం. మరోవైపు తెలంగాణలో పామాయిల్ సాగును 3.20 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రస్తుతం పామాయిల్ సీడ్‌ను మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో దేశీయంగా సమకూర్చుకునేలా ఇక్రిశాట్‌తో కలిసి పని చేయాలని టీజీ ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. సీడ్ తయారీకి ఇప్పటికే ఖమ్మం జిల్లా అంజనాపురంలో సీడ్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ సానుకూల ఫలితాలు వస్తే దేశానికే పామాయిల్ హబ్‌గా తెలంగాణ నిలుస్తుంది.


