సూపర్‌బజార్(కొత్తగూడెం): అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేసి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీర్పుగా మారేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తే రాజకీయ ముఖచిత్రం మారుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని తెలిపా రు. ఓటరు నమోదు సన్నాహాక సమావేశం కొత్తగూడెంలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, తాత మధుసూదన్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, దిండిగల రాజేందర్, కంచర్ల కృష్ణ, ఉప్పల వెంకటరమణ, మానె రామకృష్ణ, కాపు సీతా మహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీతో పాటు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలేమీ ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రభు త్వ వైఫల్యాలు, నిరుద్యోగ యువత సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఓట రు నమోదు విషయంలో ఇతర పార్టీల కంటే ముందుండాలని, ఎంత ఎక్కువ మంది ఓటర్లను నమో దు చేయిస్తే అంత బలమైన తీర్పు వెలువడుతుందని తెలిపారు. కాగా, కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంగళవారం ఉదయం వాకర్లను కలిసిన బీఆర్‌ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకుని, ఎన్నికలప్పుడే కాకుండా ఎప్పటికీ ప్రజల మధ్య ఉండే వారికి పట్టం కట్టాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, నాయకులు అనుదీప్, జైరాం తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు తాటి రాజీనామా?
బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన గౌరవం ఇవ్వనిచోట ఇమడలేమని వెల్లడించిన ఆయన... అనుచరులతో చర్చించాక రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
సన్నాహక సమావేశంలో ఎంపీ రవిచంద్ర


