విస్తారంగా డోలమైట్ నిక్షేపాలు
● మామిడిగుండాల సీలింగ్ భూముల్లో విస్తరించిన ఖనిజ నిక్షేపాలు ● వెలికితీస్తే స్థానికంగా పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ● అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని విన్నపాలు
ఇల్లెందురూరల్: మామిడిగుండాల రెవెన్యూ సర్వే నంబర్ 130 పరిధిలోని సీలింగ్ భూముల్లో డోలమైట్, లాటరైట్ నిక్షేపాలు అపారంగా నిల్వ ఉన్నాయి. సింగరేణి సంస్థకు పుట్టినిల్లైన బొగ్గుట్ట ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు అంతరిస్తున్న వేళ వీటిని వెలికితీస్తే ఇల్లెందుకు పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.
దశాబ్దం క్రితమే లాటరైట్ తవ్వకాలు
మామిడిగుండాల సీలింగ్ భూముల విషయంలో భూస్వాములు, స్థానిక గిరిజనుల నడుమ వివాదం కొనసాగుతున్న వేళ భూగర్భంలో నిల్వ ఉన్న ఖనిజ సంపదపై కొందరు దృష్టి సారించారు. ఈ క్రమంలో లాటరైట్‌ను గుర్తించి సిమెంట్ పరిశ్రమలకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు. లాటరైట్‌లో సిలికా 33 శాతమే ఉండటంతో ధర తక్కువగా పలికింది. దీంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని తవ్వకాలు నిలిపివేశారు. కాగా, సున్నపురాయి, లాటరైట్, బొగ్గు, నీటి వనరులు స్థానికంగా పుష్కలంగా ఉన్నందున ఇక్కడే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ ప్రయోజనాలు
డోలమైట్ సహజ అలోహ ఖనిజం. రసాయనికంగా దీనిని కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ అని పిలుస్తారు. ఇనుమును కరిగించే ప్రక్రియలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ప్లక్స్‌గా ఉపయోగిస్తారు. పొలాల్లో నేల ఆమ్ల స్వభావాన్ని తగ్గించి మట్టి పీహెచ్ విలువ సమతుల్యం చేసేందుకు డోలమైట్ పౌడర్ వినియోగిస్తారు. సిమెంట్ తయారీలో ముఖ్యమైన ముడిసరుకుగా కూడా ఉపయోగిస్తారు.
ఉన్నతాధికారులు స్పందించాలి..
సీలింగ్ భూముల రీసర్వే కోసం సోమవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో సీలింగ్ భూములకు సరిహద్దులు, సాగులో ఉన్న రైతులకు, భూమికి సంబంధించిన వాస్తవ యజమానులకు సరిహద్దులతో కూడిన పట్టాల పంపిణీపైనే అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించారు. కానీ ఖనిజ సందప కలిగిన భూములపై స్పష్టతనివ్వలేదు. సర్వే సమయంలోనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏర్పాటుపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.
సీలింగ్ భూముల్లో సాగుకు యోగ్యంకాని స్థలంలో, ఎత్తైన రాళ్లు ఉన్న ప్రాంతంలో డోలమైట్ నిక్షేపాలు ఉన్నట్లు ఆలస్యంగా గుర్తించారు. ఇవి సుమారు 50 నుంచి 60 ఎకరాల్లో విస్తరించినట్లు ఉన్నట్లు భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు తరలించి నాణ్యతను కూడా పరీక్షించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా కొనసాగుతున్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం డోలమైట్ ప్లాంట్‌లో వినియోగిస్తున్న ఖనిజ నాణ్యతకు సరిసమానంగా ఉన్నట్లు గుర్తించారు. కానీ భూవివాదం కొలిక్కి రాకపోవడంతో విషయాన్ని గుట్టుగా ఉంచారు. ప్రభుత్వం శాసీ్త్రయంగా అధ్యయనం చేసి, నిల్వల పరిమాణం బట్టి ఇక్కడ డోలమైట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. తద్వారా స్థానికులకు ఉపాధితోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుంది.


