కలెక్టరేట్ ఎదుట ధర్నా
బకాయిలు విడుదల చేయాలి
అంగన్‌వాడీల
● 11 నెలలుగా పేరుకుపోయిన అద్దె బకాయిలు ● కేంద్రాలకు తాళం వేస్తామంటున్న యజమానులు ● ఈవెంట్, గ్యాస్ బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం
కొత్తగూడెంఅర్బన్: అద్దె భవనానాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ సెంటర్లకు తాళాలు వేసే పరిస్థితి నెలకొంది. 11 నెలలుగా అద్దె బకాయి విడుదల కాకపోవడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేస్తున్నారని అంగన్‌వాడీ సిబ్బంది పేర్కొంటున్నారు. అద్దె అర్బన్ ఏరియాలో రూ.4 నుంచి రూ.5 వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1500 నుంచి రూ.2 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నెలకు రూ.500 చెల్లించాల్సి ఉండగా, ఏడాది కాలంగా విడుదల చేయడంలేదు.
గ్యాస్, కూరగాయల బిల్లులది అదే పరిస్థితి
జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లకు వచ్చే చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి. కేంద్రం నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం రోజుకు ఒక్క పిల్లవాడికి 25 పైసలు, గర్భిణులకు 50 పైసలు కేటాయిస్తుంది. అవి కూడా కొన్ని మండలాల్లోని కేంద్రాలకు విడుదల కావడంలేదు. మరికొన్ని మండలాల్లో ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కూరగాయల బిల్లు కూడా సంవత్సరం నుంచి విడుదల కావడం లేదు. ఫలితంగా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందడంలేదు. ఆకు కూరలు, పప్పు కూడా అందించడంలేదు. మెనూ చార్జీలు పెంచాలని, ఒక్కొక్కరికి రూ.2 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. 2024లో సమ్మె కాలపు వేతనం కూడా ఇప్పటివరకు చెల్లించలేదు. వేతనాలు పెంచాలని టీచర్లు, ఆయాలు కోరుతున్నారు. ఉదయం 9 గంటలలోగా అంగన్‌వాడీ లొకేషన్‌లో ఫొటో దిగి హాజరు పడకుంటే గైర్హాజరుగా గుర్తిస్తున్నారని, కొంచెం ఆలస్యమైనా హాజరు తీసుకోవడం లేదని టీచర్లు, ఆయాలు వాపోతున్నారు. విధుల అనంతరం పిల్లల హౌస్ విజిట్ చేసి వారికి సంబంధించిన విషయాలను వీడియో తీసి అప్‌లోడ్ చేయాల్సిన పనులు అంగన్‌వాడీలకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో సమస్యలన్నీ పరిష్కరించాలని అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళన బాటపట్టారు.
సూపర్‌బజార్(కొత్తగూడెం): అంగన్వాడీ కేంద్రాల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ టీచర్లు, ఆయాలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏడాది కాలంగా అద్దెలు, గ్యాస్ చార్జీలు, ఆరోగ్యలక్ష్మి నిధులు, ఈవెంట్ బిల్లులు చెల్లించడంలేదన్నారు. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, దసరా పండుగ సెలవులు మంజూరు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణి, నాయకులు రెడ్డి అరుణ, భూక్యా లలిత, విజయ, భారతి, సంధ్య, ప్రమీల, చిన్నారి, విజయలక్ష్మి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, నాయకులు వేల్పుల మల్లికార్జున్, భూక్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ కేంద్రాల బకాయిలు చెల్లించాలి. అద్దెలు 11 నెలలుగా విడుదల కాకపోవడంతో సెంటర్లలో ఉండే పరిస్థితి లేదు. కూరగాయలు, ఇతర బిల్లులు కూడా మంజూరు చేసి, టీచర్లు, ఆయాల ఆర్థిక ఇబ్బందులు తొలగించాలి.
–గోనె మణి, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు


