● కలెక్టరేట్ ఎదుట ఆరు గంటలపాటు ఆందోళన ● జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
సూపర్‌బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు కదం తొక్కారు. ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(ఏజెఏసీ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన కొనసాగించారు. 1/70 చట్టంపై గిరిజనేతరులు సుప్రీం కోర్టులో వేసిన ఘటనప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ ఏరియా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, 1/70, పీసా, ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డీఆర్‌ఓ పద్మావతి, పోలీసులు నచ్చజెప్పినా ఆందోళన కారులు శాంతించలేదు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. రాత్రి 7 గంటల తర్వాత కలెక్టర్ అంకిత్‌తో ప్రతినిధులు చర్చలు జరిపారు. సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రాత్రి 8 గంటలకు ఆందోళన విరమించారు. తొలుత ఇల్లెందు క్రాస్‌రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాస్, వాసం రామకృష్ణ, వట్టం ఉపేందర్, వర్స నరసింహారావు, రమణాల లక్ష్మయ్య, ఊకే రవి, మడకం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భారీగా స్తంభించిన ట్రాఫిక్
ఆందోళనతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రెండు గంటలపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. పాల్వంచ నుంచి కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలను నవభారత్, ఎర్రగుంట, పాతకొత్తగూడెం మీదుగా పంపించారు. కొత్తగూడెం నుంచి వచ్చే వాహనాలను పాలయకోయ తండా మీదుగా మళ్లించారు. ఇల్లెందు క్రాస్ రోడ్ వద్ద అధిక సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. ఆర్టీసీ బస్సులూ నిలిచిపోగా, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.


