తల్లిపాలతో బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెంపు
పుట్టిన అర్ధగంటలోపు ముర్రుపాలు పట్టించాలి
ఈ నెల 7 వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారోత్సవాలు
ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వాలి
భారం అనుకోవద్దు..
భద్రాచలంఅర్బన్/అశ్వాపురం: నవజాత శిశువుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్ల లకు అవే అమృతమని, శిశువు జన్మించిన వెంటనే ముర్రుపాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. తల్లిపాల ఆవశ్యకత తెలిపేలా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు
రోగ నిరోధశ శక్తికి దోహదం..
మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి తల్లిపాల ఆవశ్యకత, బిడ్డ పోషణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. బిడ్డకు తొలి అరగంటలోపే తాగిస్తే చాలా రోగాల నుంచి రక్షించుకోవచ్చు. ముర్రుపాలలో విటమిన్ ఏ, బీ, ఐరన్ ఉండటంతో పేగులకు బలాన్నిచ్చి, జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు, విరేచనాలు వంటి రుగ్మతల నుంచి కాపాడుతాయి. శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మ వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణనిస్తాయి. అలాగే, రాత్రుళ్లు పాలివ్వడం వల్ల తల్లి మెదడు నుంచి ప్రొలాక్టిన్ ఎక్కువగా స్రవిస్తుంది. కాగా, జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీల వారీగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2,061 అంగన్వాడీల్లో 7,274 మంది గర్భిణులు, 3,101 మంది బాలింతలు ఉన్నారు.
తల్లికీ ఉపయోగం..
బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్, అండాశయ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని పేర్కొంటున్నారు. అయితే, కొందరు బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాల కంటే ఆవు పాలే పడతారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. 100 గ్రాముల ఆవు పాలల్లో ఉండే కేలరీలు, 100 గ్రాముల తల్లి పాలల్లో ఉండే కేలరీలతో సమానం. అంతకు మించి తల్లి పాలకు, ఆవు పాలకు సారూప్యత లేదు.
100 మిల్లీ లీటర్ల తల్లిపాలలో పోషకాలు
100 మిల్లీ లీటర్ల తల్లిపాలలో కొవ్వు 4.2 గ్రాములు, ప్రొటీన్లు 1.1 గ్రాములు, లాక్టోజ్ 7 గ్రాములు, ఒలిగో శాఖరైడ్ 0.5 గ్రాములు, కాల్షియం 0.3 గ్రాములు, ఫాస్పరస్ 0.014 గ్రాములు, సోడియం 0.015 గ్రాములు, పొటాషియం 0.055 గ్రాములు, క్లోరిన్ 0.043 గ్రాములు ఉంటాయి.
మదర్ మిల్క్ బ్యాంక్..
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్‌ను అందుబాటులో తీసుకురానుండగా, మరో నాలుగు, ఐదు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఖమ్మంలో ఒక మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులో ఉంది.
బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలివ్వాలి. రోజుకు 10 నుంచి 12 సార్లు బిడ్డకు పాలు ఇవ్వాలి. బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ పాలు పట్టించవచ్చు. అవి ఎంతో ఆరోగ్యం. తల్లి పాలు ఇస్తే ఆరోగ్యం దెబ్బతింటుందనేది అపోహ మాత్రమే.
–డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, సూపరింటెండెంట్,
భద్రాచలం ఆస్పత్రి
పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు పట్టించాలి. 6 నెలల తరువాత తల్లిపాలతో పాటు ఇంట్లో తినే ఆహారం మాత్రమే ఇవ్వాలి. అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను తెలియజేస్తూ, ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
–స్వర్ణలత లేనినా, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి


