● గోదావరి వరదలకు దెబ్బతిన్న పత్తిచేలు ● ఎకరాకు రూ. 20 వేల వరకు నష్టం
బూర్గంపాడు: నిన్నటి వరకు చినుకు కోసం ఎదురుచూసిన రైతులను ఒక్కసారిగా వచ్చిపడిన గోదావరి వరద నిండా ముంచింది. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో సుమారు ఐదువేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇందులో సుమారు 2400 ఎకరాల పత్తి చేలు, 1400 ఎకరాల వరి మాగాణులు, 800 ఎకరాలలో జామాయిల్, మిగతా 400 ఎకరాలలో ఇతర పంటలున్నాయి. వరి, జామాయిల్ పంటలకు గోదావరి వరదల వల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఒక్కసారి నీటమునిగితే చచ్చిపోయే పత్తికి మాత్రం వరదతో తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం సాయంత్రం నుంచి నీటమునిగిన పత్తిచేలలోని వరదనీరు ఆదివారం తెల్లవారుజాము వరకు నిల్వ ఉంది. దీంతో పత్తిమొక్కల ఆకులపై ఒండ్రు పేరుకుపోయి మొక్కలు వడలిపోతున్నాయని, అవి ఎండిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడులు పెట్టామని, మళ్లీ ఇప్పుడు పత్తి గింజలు వేసుకోవాలంటే పెట్టుబడులు పెరిగిపోతాయని వాపోతున్నారు. అప్పులు చేసి పత్తిగింజలు వేయాలనుకున్న అదును దాటిపోయిందని పేర్కొంటున్నారు.
సస్యరక్షణ తరుణంలో..
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పత్తిగింజలు రెండు, మూడు విడతలుగా వేసుకోవాల్సి వచ్చింది. పత్తిగింజలకే రైతులు ఎకరాకు రూ.6 వేల వరకు ఖర్చు చేశారు. వానలు సకాలంలో కురవకపోవటంతో మొక్కలు సరిగా మొలవక రైతులు ఇబ్బందులు పడ్డారు. మొలిచిన మొక్కలకు ఇటీవల కురిసిన తేలికపాటి వానలతో రైతులు తొలివిడత ఎరువులు వేసుకున్నారు. పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపడుతున్న తరుణంలో ఒక్కసారిగా వచ్చిన గోదావరి వరద రైతులను నట్టేట ముంచింది. దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు.


