పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడగా, క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో...
భద్రాచలంటౌన్: సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
సింగరేణి ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం): సింగరేణిలో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్, టీఅండ్‌ఎస్ గ్రేడ్‌డీ పోస్టులను అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. 19 ఖాళీ పోస్టులకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించగా, 196 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాత పరీక్ష విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో, సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహించారు. పరీక్షను జీఎం(పర్సనల్) ఈఈ అండ్‌ఆర్‌పీ ఏజేఎం మురళీధరరావు, ఏజీఎం(విజిలెన్స్) ఎస్‌వీ మురళీధరరాజు పర్యవేక్షించారు.
కేయూ దూరవిద్యలో
ప్రవేశాల గడువు పొడిగింపు
ఖమ్మంసహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, పీజీ, డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఖమ్మం యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి.గోపి సూచించారు. పూర్తి వివరాలకు 80088 11998 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
రేక్ పాయింట్‌కు 2,520 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు ఆదివారం ఎన్‌ఎఫ్‌ఎల్ కంపెనీకి చెందిన 2,520 మెట్రిక్ టన్నుల యూరియా, 127.6 అమ్మోనియం సల్ఫేట్ చేరింది. యూరియాను ఖమ్మం జిల్లాకు 1,020 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 800 మె.టన్నులు సరఫరా చేసినట్లు ఖమ్మం డీఓఏ డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మె. టన్నుల యూరియా బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.


