తగ్గిన ఉధృతి
● భద్రాచలం వద్ద మూడు ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ ● నాలుగు గంటలపాటు గరిష్ట స్థాయిలోనే నిలకడగా ప్రవాహం ● రాకపోకల పునరుద్ధరణ.. ఊపిరి పీల్చుకున్న ముంపు గ్రామాల ప్రజలు
భద్రాచలంటౌన్: రెండు రోజులపాటు ఉధృతంగా ప్రవహించిన గోదావరి నది శాంతించింది. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉపనదులు ఒక్కసారిగా పొంగిపొర్లాయి. ఉపనదుల నుంచి భారీగా వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు 56.1 అడుగుల స్థాయికి చేరిన వరద సమారు నాలుగు గంటలపాటు నిలకడగా కొనసాగింది. వేగంగా పెరిగిన వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది.
ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ
గోదావరి నీటిమట్టం శనివారం రాత్రి 11.16 గంటలకు 52.9 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఆదివారం ఉదయం 7.45 గంటలకు 47.9 అడుగులకు, సాయంత్రం 5.12 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో రెండో, మొదటి ప్రమాద హెచ్చరికలను కూడా ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రవాహం ప్రమాద స్థాయి కంటే కిందకు పడిపోవడంతో అధికారులు, ముంపు ప్రభావిత, ఏజెన్సీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
రహదారులపై తగ్గిన నీరు
వరద ఉధృతి తగ్గడంతో ప్రధాన రహదారులపై నుంచి వరద నీరు తొలగిపోయింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. అంతర్గత రహదారులపై కొన్నిచోట్ల బురద పేరుకుపోయి ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
స్నానఘట్టాలపై పేరుకుపోయిన బురద
వరద తగ్గినా భద్రాచలం వద్ద స్నానఘట్టాలు, కల్యాణకట్టలపై బురద, వ్యర్థాలు పేరుకుపోయాయి. పారిశుద్ధ్య పనులు పూర్తయి ఘాట్లు సాధారణ స్థితికి వచ్చే వరకు భక్తులు ఎవరూ నదీ తీరానికి రావొద్దని అధికారులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
గోదావరి నీటిమట్టం శనివారం రాత్రి ఒంటిగంటలకు 52 అడుగులకు తగ్గింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 49 అడుగులు, మధ్యాహ్నం 3 గంటలకు 44 అడుగులు, రాత్రి 11 గంటలకు 40.90
అడుగులకు నీటిమట్టం
పడిపోయింది.


