రామాలయ అభివృద్ధికి పర్యవేక్షణ కమిటీ.. | - | Sakshi
Sakshi News home page

రామాలయ అభివృద్ధికి పర్యవేక్షణ కమిటీ..

Jul 4 2026 12:38 AM | Updated on Jul 4 2026 12:38 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న ఆలయ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆలయంలో పునరుద్ధరణ, పునరాభివృద్ధి పనులకు మొదటి దశలో రూ.351 కోట్లను ప్రకటించింది. గోదావరి పుష్కరాలు–2027కు రూ. 75 కోట్లు, మిగిలిన రూ. 276 కోట్లు ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించింది. టెండర్‌ దక్కించుకున్న ప్రైవేట్‌ సంస్థ చేపడుతున్న పనులను పర్యవేక్షించేందుకు, ఆగమశాస్త్రాల ప్రకారం సజావుగా సాగేలా 9 మందితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సాంకేతిక అంశాలపై సలహాలు, పనుల పురోగతి సమీక్ష, అడ్డంకులు ఎదురైతే తొలగించేందుకు కమిటీ వారానికోసారి సమావేశం నిర్వహించాల్సి ఉంది. సమస్యలు, మార్పులు ఉంటే ప్రభుత్వానికి నివేదించడంతోపాటు భక్తుల రాకపోకలకు, ఆలయ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యతలు కమిటీకి అప్పగించింది.

ఈఓ కన్వీనర్‌గా..

రామాలయ ఈఓ కన్వీనర్‌గా మరో 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ధార్మిక సలహాదారు శ్రీ గోవింద్‌ హరి, జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, రామాలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, హెడ్‌ ఆఫీస్‌ స్థపతి, ప్రధాన అర్చకుడు–1 ఎ. విజయ రాఘవన్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, కన్జర్వేషన్‌ ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణ మూర్తి, కాంట్రాక్టర్‌ రామకృష్ణా రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement