తొలి త్రైమాసికంలో ఏరియాల వారీగా
బొగ్గు ఉత్పత్తి వివరాలు (టన్నుల్లో)
లక్ష్యసాధనకు కృషి చేస్తాం
● జూన్‌లో సింగరేణి వ్యాప్తంగా 102 శాతం బొగ్గు ఉత్పత్తి ● త్రైమాసికంలో మాత్రం 87 శాతంగానే నమోదు ● గత ఏడాదితో పోలిస్తే ఉత్పత్తిలో వెనుకంజ
రుద్రంపూర్: సింగరేణి సంస్థ వ్యాప్తంగా గడిచిన జూన్‌లో 102 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైంది. అయితే, ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మాత్రం 87 శాతంగానే నమోదైంది. గతేడాది జూన్ నాటికి 15.96 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైతే, ఈసారి 12.72 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదు కాగా వెనకబడినట్లయింది. ఓసీలు, భూగర్భ గనుల్లో నిర్దేశిత లక్ష్యం మేర ఉత్పత్తి సాధించేలా ప్రతీ మంగళ, శనివారం సీఎండీ, డైరెక్టర్లు సంస్థవ్యాప్తంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా లక్ష్యం చేరకపోవడం గమనార్హం.
పర్యవేక్షణ లోపమే కారణమా?
సింగరేణిలో ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టి ఏడాది కావొస్తోంది. ఈ క్రమాన గనుల్లో పర్యటించి ఉత్పత్తి వెనుకబాటుకు కారణాలు ఆరా తీస్తూ అనువైన పరిష్కార మార్గాలు చూపించాల్సి ఉంది. కానీ, అలా జరగకపోవడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రావడం లేదని చెబుతున్నారు. కొందరు అధికారులు కార్యాలయం కదలకపోగా, ఫైళ్లు కూడా పరిష్కరించడం లేదని తెలుస్తోంది.
జూన్‌లో నాలుగు
ఏరియాలు
సింగరేణి ఏటా ఏరియాల వారీగా రోజు, నెల, వార్షిక లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఇందులో కొన్ని ఏరియాలు 100 శాతం లక్ష్యసాధకు కృషి చేస్తుండగా, ఇంకొన్ని వెనకపడుతున్నాయి. ఇందుకు కారణాలు ఏమైనా ఇది వార్షిక లక్ష్యసాధనపై ప్రభా వం చూపుతోంది. గడిచిన జూన్‌లో మణుగూరు ఏరియా 171 శాతం ఉత్పత్తితో సంస్థలో అగ్రస్థానాన నిలిచింది. ఆ తర్వాత బెల్లంపల్లి ఏరియా 157 శాతంతో రెండో స్థానాన, సత్తుపల్లిలో 144 శాతం, ఆర్జీ–2 ఏరియాలో 109 శాతం సాధించి మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. ఉత్పత్తి పరంగా చూస్తే సత్తుపల్లి ఏరియా 12,80,984 టన్నులు సాధించగా, మణుగూరు ఏరియాలో 11,08,133 టన్నులు, ఆర్జీ–2 ఏరియాలో 8,07,125, బెల్లంపల్లి ఏరియాలో 3,14,347 టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదైంది. కాగా, కొత్తగూడెం ఏరియాలో 85 శాతం, ఇల్లెందు 60 శాతం, మందమర్రి 40 శాతం, శ్రీరాంపూర్ 31 శాతం, ఆర్జీ–1 ఏరియా 21 శాతం, ఆర్జీ–3 ఏరియా 92 శాతం, భూపాలపల్లి ఏరియా 45 శాతం, ఆండ్రియాలా 12 శాతం ఉత్పత్తి మాత్రమే సాధించగలిగాయి.
ఏరియా ఉత్పత్తి లక్ష్యం సాధించిన ఉత్పత్తి ఉత్పత్తి
సత్తుపల్లి 35,45,000 39,11,068 110
మణుగూరు 25,62,500 32,40,326 126
ఆర్జీ–2 20,57,400 20,01,390 97
శ్రీరాంపూర్ 15,01,500 4,56,540 30
ఆర్జీ–1 11,12,700 3,85,236 35
ఆర్జీ–3 8,85,000 5,43,336 61
బెల్లంపల్లి 8,00,000 9,38,981 117
ఇల్లెందు 7,35,000 4,92,262 67
భూపాలపల్లి 7,08,300 2,68,812 38
మందమర్రి 6,59,500 4,12,494 64
కొత్తగూడెం 62,400 51,583 83
ఏఎల్‌పి 46,400 24,369 53
మొత్తం 1,46,65,700 1,27,26,397 87
ఏరియాల వారీగా ఉత్పత్తి, లక్ష్యసాధనలో వెనకంజకు కారణాలపై సమీక్షలు నిర్వహిస్తాం. ఇందుకోసం ప్రతీ గనిపై ప్రత్యేక దృష్టి సారించనున్నాం. తద్వారా 100 శాతం ఉత్పత్తి సాధించే దిశగా కృషి చేస్తాం.
–వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)


