కనెక్షన్లు ఎన్నయినా..
● అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తులకు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ● ఎన్పీడీఎసీఎల్‌లో అమల్లోకి వచ్చిన నూతన విధానం
ఖమ్మంవ్యవసాయం/సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యుత్ వినియోగదారులకు సులభమైన, వేగవంతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో టీజీ ఎన్పీడీసీఎల్ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల కోసం ‘బల్క్ / మల్టిపుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఒకే భవనానికి ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు అవసరమైతే విడివిడిగా కాకుండా ఒకే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. తద్వారా బిల్డర్లు, డెవలపర్లు, భవన యజమానులు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వాహకులకు సమయం కలిసిరానుంది. ఈ విధానం అమలు, ప్రయోజనాలను శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం ఎస్‌ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, గొట్టిముక్కుల మహేందర్ వేర్వేరు ప్రకటనల్లో వివరించారు.
అపార్ట్‌మెంట్లు, మల్టీ స్టోర్డ్ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు అవసరమైన ఎల్‌టీ కేటగిరీ–1, 2 కనెక్షన్లకు కొత్త విధానం వర్తిస్తుంది. మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా చార్జీలు నిర్ణయిస్తారు. 20 కిలోవాట్ల వరకే డెవలప్‌మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తిస్తాయి. 20 కిలోవాట్లకు పైగా కేవలం సర్వీస్ లైన్ చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. ఒక కిలోమీటర్ లోపు విద్యుదీకరణ ఉన్న నెట్‌వర్క్ నుంచి ఓవర్ హెడ్ లైన్లకు మాత్రమే వర్తిస్తుంది. అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్‌ను వినియోగదారుల నుంచి అదనపు వ్యయం లేకుండానే ఏర్పాటు చేస్తారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) రెగ్యులేషన్ ప్రకారం ఏకరీతిలో చార్జీలు వర్తిస్తాయి.
బల్క్ / మల్టిపుల్ అప్లికేషన్ నమోదు సమయంలోనే సర్వీస్ లైన్ చార్జీలు పూర్తిగా చెల్లించాలి. తద్వారా దరఖాస్తుల పరిశీలన, కనెక్షన్ల మంజూరు త్వరగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
వినియోగదారులు ఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్ ద్వారా బల్క్/మల్టిపుల్ అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తద్వారా కనెక్షన్ల మంజూరులో ఆలస్యం తగ్గి అపార్ట్‌మెంట్లు, గృహ నిర్మాణ, వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవలు అందుతాయి. అలాగే, దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వివరాల కోసం 1912 లేదా 1800–425–0028 టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించవచ్చని ఎస్‌ఈలు వివరించారు.


