‘ఆరోగ్య’ లక్ష్యాలను సాధించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య’ లక్ష్యాలను సాధించాలి

Jul 4 2026 12:32 AM | Updated on Jul 4 2026 12:32 AM

చుంచుపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్‌ అన్నారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా ఆరోగ్య పర్యవేక్షకుల సమీక్షలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, వార్డులస్థాయిలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్‌ జ్వరాలు, విరేచనాలు వంటి సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, యాంటీ లార్వల్‌ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీలు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. జ్వరాల సర్వే, ఇంటింటి సందర్శన, వ్యాధుల పర్యవేక్షణ, అసంక్రామిత వ్యాధుల స్క్రీనింగ్‌ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పేర్కొన్నారు. ఆరోగ్య విద్యా బోధకులు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రజా సమావేశాల్లో ఆరోగ్య చైతన్య కార్యక్రమాలు నిర్వహించి మూఢ నమ్మకాలు, దుష్ప్రచారాలు, పుకార్లు, చేతబడులు వంటి అవాస్తవాల వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీహెంహెచ్‌ఓ స్పష్టం చేశారు. సమావేశంలో సిబ్బంది సైదులు, శ్రీధర్‌, ప్రసాద్‌, ప్రతాప్‌, దినేశ్‌, రాకేశ్‌, ఆరోగ్య విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement