అశ్వారావుపేటరూరల్: అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి జనారాణ్యంలోకి వచ్చిన ఓ దుప్పి మృతి చెందిన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని పాపిడిగూడెం మార్గంలోగల ఓ పామాయిల్ తోట నుంచి దుర్వాసన రాగా, స్థానిక రైతులు దుప్పి మృతి చెంది ఉండటాన్ని గమనించారు. దీంతో స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్టు రేంజర్ మురళి సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పశు సంవర్థక శాఖ వైద్యులు వినయ్ ఆధ్వర్యంలో దుప్పి కళేబరానికి పోస్టుమార్టం జరిపించారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ.. దుప్పి మృతిపై అనుమానాలు లేవని, సహజ మరణమేనని చెప్పారు. పశువైధ్యాధికారి మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితమే దుప్పి మృతి చెంది ఉంటుందని, కళేబరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. కాగా, పోస్టుమార్టం నివేదిక వచ్చిత తరవాత దుప్పి మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. దుప్పి కళేబరాన్ని అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఖననం చేశారు.
పామాయిల్ తోటలో
కళేబరం గుర్తింపు


