తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక గదులు కరువు ఆర్‌ఐ, ఇతర అధికారుల గదుల్లోనే నెట్టుకొస్తున్న వైనం అర్జీలు, నివేదికలు భద్రపరిచే ఫర్నిచర్ కూడా కొరతే
సరైన పని ప్రదేశం లేదు
దమ్మపేట: గ్రామ పరిపాలన అధికారు(జీపీఓ)లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయ వసతి మాత్రం కల్పించలేదు. విధి నిర్వహణకు ప్రత్యేకంగా గదులు కూడా లేవు. దీంతో అసౌకర్యాలతో విధులు నిర్వర్తిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసి, వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసింది. ఆ తర్వాత వచ్చిన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్వోలను తిరిగి జీపీఓలుగా నియమించింది. ఒక్కో మండలానికి ఏడునెమిది మంది చొప్పున జిల్లావ్యాప్తంగా 176 మంది జీపీఓలు పనిచేస్తున్నారు. వీరంతా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆర్‌ఐ, ఇతర అధికారుల గదుల్లోనే అసౌకర్యంగా పనిచేయాల్సి వస్తోంది. ఒకేగదిలో 8 మంది కూర్చోవడం ఇబ్బందికరంగా మారింది. కార్యాలయంలో ప్రశాంతంగా పనిచేసేందుకు వీరికి కనీసం ఒక్క గది కూడా లేదు. కుర్చీలు, టేబుళ్ల వంటి ఫర్నిచర్ కూడా సక్రమంగా లేదు. కాగా, కొన్నిచోట్ల మాత్రం సౌకర్యాలు పరవాలేదని జీపీఓలు చెబుతున్నారు.
జీపీఓల బాధ్యతలు
జీపీఓలు భూ రికార్డులు, అడంగల్ నిర్వహణ, పంటల నమోదు వంటి విధులు నిర్వర్తిస్తారు. క్షేత్రస్థాయిలో భూముల సందర్శన, ప్రజా సమస్యలపై దరఖాస్తులు, భూభారతి అర్జీలపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంది. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల పంపిణీ, గ్రామస్తులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీలో కీలక పాత్ర పోషిస్తారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకారం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు, వరదలు, అగ్నిప్రమాదాలు వంటి సమయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. ఎన్నికల నిర్వహణ, జనాభా లెక్కల సేకరణలో కూడా సహాయ సహకారాలు అందిస్తారు.
కార్యాలయంలో కూర్చుని విధులు నిర్వర్తించేలా సరైన పని ప్రదేశం అందుబాటులోకి తేవాలి. కొన్ని మండలాల్లో రాతపూర్వక పనులను చేసేందుకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇతర అధికారుల గదులనే జీపీఓలు వినియోగిస్తున్నారు తప్ప ప్రత్యేక గదులు లేవు. జీపీఓల విధుల నిర్వహణకు ప్రత్యేక గది, ఫర్నిచర్ సౌకర్యం కల్పించాలి.
–కాకా శ్రీను, జీపీఓల సంఘం జిల్లా బాధ్యుడు
భూ పత్రాల పరిశీలించేందుకు తహసీల్ కార్యాలయాల్లో కూర్చొనేందుకు కూడా ప్రత్యేక గది లేదు. విచారణ అనంతరం రిపోర్టు తయారు చేసేందుకు కార్యాలయానికి వెళ్తే కొన్ని సందర్భాల్లో కూర్చొని పనిచేసే పరిస్థితి ఉండటం లేదని జీపీఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ దరఖాస్తులు పరిశీలన, రిపోర్టుల తయారీ, తదితర రాతపూర్వక పనులను జీపీఓలు అందరూ ఒకే సమయంలో చేయాల్సివస్తే అవస్థ పడుతున్నామని వాపోతున్నారు. ఉన్న ఒక్క టేబుల్ వద్ద అందరూ కూర్చునే పరిస్థితి లేదు. ఆర్‌ఐ, ఇతర అధికారుల ముందు కార్యాలయానికి పని మీద వచ్చిన రైతులు, గ్రామస్తులు కూర్చుని ఉంటే జీపీఓలు నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దరఖాస్తులు, రిపోర్టులు భద్రపరిచేందుకు తగిన వసతులు కూడా లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విధులు
నిర్వరిస్తున్న
జీపీఓలు


