తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో రాష్ట్రీయ రహదారి పక్కనే ఓ కిరాణం షాపు తాళం పగులగొట్టి దుండగులు బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు... పిండిప్రోలుకు చెందిన కిరాణం షాపు యజమాని మల్లెబోయిన యాదగిరి గురువారం సమీప బంధువు కర్మకాండ ఉండడంతో తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి నడిగూడెం వెళ్లాడు. ఇంటికి ఇరువైపులా సీసీ కెమెరాలు ఉండగా.. శుక్రవారం ఉదయం వచ్చేసరికి షాప్ తాళం, బీరువా తాళం పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో పరిశీలించగా 70 గ్రాముల బంగారు అభరణాలు, రూ.లక్ష నగదుతో పాటు షాప్ కౌంటర్‌లోని కొంత నగదు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీంతో చేరుకుని ఆధారాలు సేకరించారు.
సీసీ కెమెరాల కంటపడకుండా...
చోరీ జరిగిన కిరాణం షాపు పిండిప్రోలు ప్రధాన రహదారి పక్కనేఉండడం, నిత్యం చాలామంది వచ్చి వెళ్తుండడంతో యజమాని యాదగిరి ముందుజాగ్రత్తగా షాపు, ఇంటి వెనకాల నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అయితే, చోరీకి వచ్చిన దుండగులు ఈ విషయాన్ని గుర్తించి... ఇంటి వెనక మెట్ల గోడవైపు నుంచి లోపలికి ప్రవేశించి, తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఎక్కడా సీసీ కెమెరాల్లో తమ ఆనవాళ్లు నమోదు కాకుండా జాగ్రత్త పడిన నేపథ్యాన స్థానికుల హస్తం ఉందా, లేక స్థానికుల సహకారంతో ఇతర ప్రాంతాలకు చెందిన వారు చోరీ చేశారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు.
70గ్రాముల బంగారు ఆభరణాలు,
నగదు దొంగతనం


