● నేడు స్వల్పకాలమే స్వామివారి దర్శనం ● చంద్ర గ్రహణంతో ప్రధానాలయం మూసివేత
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
దర్శనానికి నేడు బ్రేక్..
చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దర్శనానికి బ్రేక్ పడింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నివేదిన జరిపి ఉద యం 6.30 నుంచి 7.30 వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అనంతరం మధ్యాహ్నిక ఆరాధన చేసి 8.30 గంటలకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు తెరిచి ఆలయ శుద్ధి, శాంతి హోమం చేశాక 8.30 గంటలకు దర్శన అవకాశం కల్పిస్తారు. కాగా, నేడు నిత్యకల్యాణాన్ని రద్దు చేశామని అధికారులు వెల్లడించారు.
వెండి లక్ష్మీరూపుల వితరణ
హైదరాబాద్‌కు చెందిన పుచ్చ రాజ్యలక్ష్మి, చంద్రశేఖర్ దంపతులు లక్ష్మీ రూపం గల 333 వెండి బిళ్లలను సోమవారం ఆలయ అధికారులకు వితరణగా అందజేశారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో ఫాల్గుణ ఉత్తర పూర్ణిమ రోజున వెండి లక్ష్మీ పూజలు జరగనుండగా ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఒక్కొక్కరికి ఒక గ్రాము వెండి బిల్లలు అందించనున్నారు. ఈ మేరకు చంద్రశేఖర్ దంపతులు వెండి బిళ్లలు అందించారని, వీటి విలువ రూ.లక్ష ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్‌కుమార్, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్, స్వర్ణ కుమారి పాల్గొన్నారు.


