భూదాన్‌ దందా ! | - | Sakshi
Sakshi News home page

భూదాన్‌ దందా !

Mar 3 2026 8:07 AM | Updated on Mar 3 2026 8:07 AM

తక్కువకు వస్తుందని..

వెలుగుమట్ల స్థలాల పేరిట

చేతులు మారిన రూ.కోట్లు

నిరుపేదల ఆశలే ఆసరాగా వసూళ్లు

ఇళ్ల కూల్చివేతతో మోసపోయామని బాధితుల ఆవేదన

ఇప్పటికే 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు

ప్రత్యేక బృందాలతో విచారణ

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్‌ భూమిలో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకున్న నిరుపేదల ఆశలు అడియాసలయ్యాయి. సొంతింటి స్థలంపై పేదల ఆశలను ఆసరాగా చేసుకున్న కొందరు రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. కొన్నేళ్లుగా ఈ తంతు సాగడంతో ఈ మొత్తం రూ.10 కోట్లకు చేరిందని అంచనా. ఇంతలోనే అనుమతులు లేవని ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడంతో తాము మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఇప్పటి వరకు పోలీసులు 30 మందిని అరెస్టు చేయగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

చివరకు బాధితులై..

ఇళ్లు కోల్పోయిన వారిలో నిజమైన నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం వారికి నిలువనీడ లేకపోగా.. రెక్కలు, ముక్కలు చేసుకొని పోగేసిన డబ్బు ముఠా సభ్యులకు ఇచ్చి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డబ్బు వసూలు చేసిన ముఠా సభ్యులను బాధితులు నిలదీశారు. అంతేకాక మోసపోయిన వారి ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటికే 30 మందిని అరెస్టు చేయగా, ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని అధికారులు సూచించారు. ఏదేమైనా స్థలం కోసం రూ.లక్షలు ముట్టజెప్పడంతో ఇంటి నిర్మాణానికి రూ.లక్షల్లో అప్పు చేసిన నిరుపేదలు చివరకు బాధితులుగా మిగిలిపోవడం అందరికీ ఆవేదన కలిగిస్తోంది.

ముఠా సభ్యుల ఆస్తులేంటి?

ఇంటి జాగా కోసం రూ.లక్షల్లో వసూలు చేసిన వారి పేర్లతో ఫిర్యాదులు అందడంతో పోలీసులు వారిని అరెస్టుచేయడమే కాక ఆస్తుల వివరాలను సేకరిస్తున్నా రు. ముఠాలో సభ్యులు ఏ ప్రాంతం వారు, ఎందరు.. వీరి స్వస్థలాల్లో కుటుంబీకులు, బంధువుల పేర్లపై ఏమేం ఆస్తులు ఉన్నాయి, ఇటీవల ఏవైనా కొనుగోలు చేశారా అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.కోట్లలో ఉంటుందని భావిస్తుండగా.. ఆ మొత్తాన్ని ముఠా నుంచి బాధితులకు ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పోలీసు యంత్రాంగం విచారణలో వేగం పెంచింది.

10వ తేదీలోగా పూర్తి

భూదాన్‌ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారిలో పేదలను ఆదుకుంటామని ప్రకటించిన మంత్రి పొంగులేటి.. ఈనెల 15వరకు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయిస్తామని వెల్లడించారు. దీంతో అర్హుల గుర్తింపు సర్వేను ఈనెల 10లోగా పూర్తిచేసి జాబితాను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. పేదలు స్థలం కోసం డబ్బు ఎంత ఇచ్చారనే వివరాలూ సర్వేలో నమోదు చేస్తున్నట్లు సమాచారం.

ఖమ్మం నగరానికి ఆనుకుని వైరా రోడ్డు సమీపాన ఉన్న భూదాన్‌ భూమి ఎకరం ధర బహిరంగ మా ర్కెట్‌ ఆధారంగా రూ.కోట్లలో ఉంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 31.7 ఎకరాల విలువ రూ. 250 కోట్లుగా కలెక్టర్‌ ప్రకటించడంతో ఎంత హాట్‌ కేకో అర్థమవుతుంది. నగరానికి సమీపాన ఉన్నందున కాస్త స్థలం దొరికినా నీడ ఏర్పాటుచేసుకోవచ్చని నిరుపేదలు ఆశించారు. ఇదే అదునుగా ముఠాగా ఏర్పడిన కొందరు రూ. లక్ష నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. ఈ తంతు ఏళ్లుగా కొనసాగడంతో స్థలం పొందిన వారిలో కొందరు గుడిసెలు, మరికొందరు రేకులు, కొంచెం స్థోమత ఉన్న వారు స్లాబ్‌తో ఇంటి నిర్మాణం చేపట్టారు. తక్కువ ఖర్చుతో గూడు దక్కిందని ఆనందపడుతుండగానే కూల్చివేతలతో ఆ సంతోషం ఆవిరైపోయింది.

భూదాన్‌ భూముల్లో ఇంటి స్థలం ఇప్పిస్తామంటూ కొందరు డబ్బు వసూలు చేశారని ఫిర్యాదులు అందాయి. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ముఠా సభ్యులు రూ.1.25కోట్లు వసూలు చేశారని తెలుస్తోంది. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలి. ప్రత్యేక బృందాలతో విచారణ చేపడుతుండగా.. పేదలను మోసగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

– సునీల్‌దత్‌, ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement