మళ్లీ మొదటికి..
జిల్లా కేంద్రంలో నిర్మాణం
పూర్తయిన హరిత హోటళ్లు
78 గదులు, కాటేజీలు, డార్మిటరీలు, కన్వెన్షన్ హాల్ సిద్ధం
నిర్మాణం తరహాలోనే ప్రారంభానికీ ఆపసోపాలు
నవమికై నా అందుబాటులోకి
తెస్తారా అని ఎదురుచూపులు
నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకే
నవమి పండగ ముంగిట్లోకి వచ్చేసింది. భద్రాచలంలో ఇప్పటికే పనులు చకచకా సాగుతున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం వస్తారు. అయితే వారికి భద్రగిరిలో వసతి సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించే అవకాశం అందుబాటులో ఉన్నా.. ఒడిసి పట్టుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలం అవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
అందుబాటులో 78 గదులు
జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో కాటేజీలు, హోటళ్ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆగుతూ సాగుతూ వచ్చాయి. గదుల నిర్మాణం నాలుగేళ్ల క్రితమే పూర్తయినా కిటీకీలు, తలుపుల బిగింపు వంటి పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే గతేడాది కాలంగా ఈ పనుల్లోనూ కదలిక వచ్చింది. 2024 డిసెంబర్ నాటికి అందుబాటులో తెస్తామని అధికారులు ప్రకటించినా.. చివరకు 2025 డిసెంబర్ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ వద్ద నిర్మిస్తున్న హరిత హోటల్‌లో 42 గదులు, కిన్నెరసాని డ్యాంసైట్ దగ్గర ఎకో టూరిజంలో భాగంగా నిర్మించిన హరితా హోటల్‌లో 36 గదుల నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఇక్కడ పర్యాటకులు విడిది చేసేందుకు 78 గదులతో పాటు డార్మిటరీలు, బార్, రెస్టారెంట్, మూడు చిన్న ఫంక్షన్ హాళ్లు, ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ ఉన్నాయి.
ఆదరణ బాగుంటుంది..
శ్రీరామనవమి, ముక్కోటి, హనుమాన్ జయంతి పండుగలతో పాటు ఇతర పర్వదినాలు, వరుస సెలవులు వచ్చినప్పడు భద్రాచలానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా నవమి, ముక్కోటి సందర్భంగా భద్రాచలంలో వసతి దొరకడం కష్టంగా మారుతోంది. ఇతర జిల్లాల నుంచి డ్యూటీపై వచ్చే ప్రభుత్వ సిబ్బందికి కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో భద్రాచలానికి కేవలం గంట ప్రయాణ దూరంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచలోని ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటారు. శ్రీరామనవమికి కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు అన్ని హోటళ్లలో గదులు ముందుగానే బుక్ అయిపోతాయి. కనీసం ఈ నవమికై నా హరితా హోటళ్లను అందుబాటులోకి తీసుకొస్తే పర్యాటకులు/భక్తులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఆరంభంలోనే ఈ హోటళ్లకు మంచి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొత్తగూడెం, కిన్నెరసాని దగ్గర త్వరలో అందుబాటులోకి రాబోయే హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది నవంబర్‌లో ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్ణీత గడువు ముగిసినా, పర్యాటక శాఖ ఆశిస్తున్న అన్ని రకాల అర్హతలు ఉన్న కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో హోటల్, కాటేజీలు పర్యాటకులకు అందుబాటులోకి రాకుండా పోయాయి. మొదటి దఫాలో టెండర్లు ఎందుకు రాలేదు? ప్రైవేటు సంస్థలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయనే అంశంపై ఇంతవరకూ చర్చ జరగలేదు. మరోవైపు ఇంత భారీ స్థాయిలో హోటళ్లు నిర్మించినా, వీటి ప్రారంభోత్సవానికి ఉన్న అడ్డంకులు ఏంటీ? వాటిని ఎలా అధిగమించాలి అనే అంశంపై ప్రభుత్వం తరఫున మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల నుంచి చొరవ కరువైంది. వెరసి ఈ హోటల్ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడనేది అంతుచిక్కని అంశంగా మారింది. మరోవైపు నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాకపోవడంతో హోటల్ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి.
హరిత హోటల్ నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించాం. ఈ మేరకు గత నవంబర్‌లో టెండర్లు పిలవగా, ఆశించిన ఫలితం రాలేదు. మరోసారి టెండర్లు పిలిచి, అర్హత సాధించిన సంస్థకు బాధ్యతలు అప్పగించి, హోటళ్లను ప్రారంభిస్తాం.
– రామకృష్ణ (డీఈ, టూరిజం కార్పొరేషన్)


