దుకాణదారులకు జరిమానా
పాల్వంచ: నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజల్ గ్లాస్‌లు అమ్ముతున్న దుకాణదారులకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. పట్టణంలోని శాస్త్రిరోడ్‌లో ఉన్న మహాదేవ, మహాలక్ష్మి ట్రేడర్స్ షాపుల్లో మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ చేపట్టారు. ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజల్ గ్లాసులు అమ్ముతున్నట్లు గుర్తించి ఒక్కో షాపునకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు. సిబ్బంది రమేష్, నాగేశ్వరరావు, యాసీన్, భరత్, బాలు తదితరులు పాల్గొన్నారు.
బొమ్మనపల్లి హైస్కూల్‌లో విచారణ
టేకులపల్లి: మండలంలోని బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వివాదంపై విద్యాశాఖ అధికారులు నాగ రాజశేఖర్, సైదులు, ఎంఈవో అజ్మీర జగన్ గురువారం విచారణ చేపట్టారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటుండగా, మధ్యాహ్న భోజన వర్కర్‌ని మార్చాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు వర్కర్, విద్యార్థులు, హెచ్‌ఎం, స్వచ్ఛ మిత్ర, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
మద్యం మత్తులో యువకుడి వీరంగం
పాల్వంచ: మద్యం మత్తులో ఓ యువకుడు రహదారిపై వీరంగం సృష్టించాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని బీసీఎం రోడ్‌లో బుధవారం అర్ధరాత్రి పవన్ అనే యువకుడు మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. వాహనాలు ఆపి, రాళ్లు విసిరాడు. కేకలు వేస్తూ నూడిల్స్ షాపులో ఉన్న ఎగ్ ట్రేలను విసిరి పడేశారు. స్థానికులు వారిస్తున్నా ఆగకుండా సుమారు గంటన్నరపాటు వీరంగం సృష్టించాడు. ఈ విషయమై ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.
పరస్పర దాడులు
దమ్మపేట: సాగు నీటి వ్యవసాయ బోరు విషయంలో ఇద్దరు సమీప బంధువులు పరస్పర భౌతిక దాడులు చేసుకున్న ఘటన గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన సున్నం జయరాజుకు అదే గ్రామానికి చెందిన సున్నం కరుణకుమారి వరుసకు సోదరి అవుతుంది. వీరికి ఉమ్మడిగా సాగు నీటి వ్యవసాయ బోరు ఉంది. నీటి బోరు విషయమై ఇద్దరి మధ్య మాటమాట పెరిగి దాడులు చేసుకున్నారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. పరస్పరం ఫిర్యాదు చేయగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
దుకాణదారులకు జరిమానా


