మళ్లీ పులి వేట
సీసీఎఫ్ ప్రత్యక్ష పరిశీలన
ఏడాది కాలంగా గ్రామాల్లోకి రాని వైనం
వన్యప్రాణులు తగ్గడంతో బయటకు వస్తున్నట్లు గుర్తింపు
వేటగాళ్లను కట్టడి చేయకపోతే కష్టమే...
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యం చివరి అంచుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో ఒకప్పుడు పెద్దపులులు ఎక్కువగానే ఉండేవి. అయితే పారిశ్రామీకరణ, పోడు వ్యవసాయంతో పాటు వేట కూడా పెరగడంతో ఇక్కడ అడవుల్లో పులులు కనుమరుగవగా అవి వేటాడి తినే దుప్పులు, సాంబర్ జింకలు, ఆఖరి అడవి పందుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక హరిత హారంతో అడవులు మరోసారి చిక్కబడడం.. ఆపై దుప్పుల వంటి వణ్యప్రాణుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కిన్నెరసాని అభయారణ్యంలో ఉన్న జింకలను ఇతర పార్కులకు తరలించే స్థాయికి ఇక్కడ వాటి సంఖ్య పెరిగింది. ఇందుకు తగ్గట్టే గడిచిన ఐదేళ్లుగా తెలంగాణ పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ నుంచి కవ్వాల్, ఏటూరునాగారం అభయారణ్యాల మీదుగా మన జిల్లాకు పులుల రాక పెరిగింది. ముఖ్యంగా మేటింగ్ సీజన్‌లో పులులు వచ్చి వెళ్లడం సాధారణ విషయంగా మారింది.
ఏడాది కాలంగా ఇక్కడే
జిల్లాలో అటు చివరన కరకగూడెం నుంచి ఇటు చివరన అశ్వారావుపేట వరకు విస్తరించిన అడవి, అక్కడి జంతుజాలాన్ని ఆసరాగా చేసుకుని ఒక పెద్ద పులి ఏడాదికి పైగా జిల్లాలోనే స్థిరంగా ఉంటోంది. ఈ పులి జిల్లా అడవులనే నివాసంగా మార్చుకుంటుందా లేక ఇతర అడవులకు వెళ్లిపోతుందా అనే అంశంపై దృష్టి సారించిన అటవీ అధికారులు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ పులి జిల్లాలోనే సంచరిస్తున్నా ఎక్కడా సమీప గ్రామాల ప్రజలకు కనిపించడం కానీ అక్కడి పశు సంపదపై దాడి చేయడం చేయడం కానీ జరగలేదు. అడవిలోనే సంచరిస్తూ అక్కడి జంతువులనే ఆహారంగా తీసుకుంటుండడంతో గ్రామాల వైపు పెద్దగా రాలేదు.
ఆహారం దొరకనప్పుడే
సాధారణంగా మనుషులు సంచరించే ప్రదేశాలు, ఊర్లకు పులులు దూరంగా ఉంటాయి. మనుషుల ఉనికిని ముందుగానే పసిగట్టి అక్కడి నుంచి తప్పుకుంటాయి. ఆహారం కోసం రాత్రివేళ మాటు వేసి అడవి పందులు, జింకలు, దుప్పులు వంటి జంతువులను వేటాడుతాయి. ఒకసారి వేటలో సగటున 25 కేజీల వరకు మాంసం తింటాయి. మిగిలిన మాంసాన్ని మూడు నాలుగు రోజుల తర్వాత తింటాయి. వేటాడే విషయంలో కూడా ఆకారంలో బలంగా, పెద్దగా ఉండే బైసన్ వంటి జంతువుల జోలికి వెళ్లేందుకు ఆసక్తి చూపించవు. అడవిలో ఆహారం లభించడం కష్టమైనప్పుడే పులులు గ్రామాల వైపు చూస్తాయి. అప్పుడే పశు సంపదను లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ ఇటీవల అశ్వారావుపేట మండలంలో రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు పశువులు పెద్ద పులుల దాడిలో చనిపోయాయి. అడవిలో పులులకు ఆహారంగా ఉండే దుప్పులు, అడవి పందులు, సాంబర్ జింకలు వంటి జంతువుల సంఖ్య తగ్గిపోయినందునే ఈ పరిస్థితి వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది.
మళ్లీ వేటగాళ్ల జోరు
జిల్లాలో వేటగాళ్ల జోరు చాలావరకు తగ్గిపోయింది. కానీ పాల్వంచ ఫారెస్ట్ డివిజన్ పరిధి ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పరిధిలో వణ్యప్రాణుల వేట ఇష్టారీతిగా సాగుతోంది. ఓ వైపు వణ్యప్రాణుల మాంసం అమ్ముకునే ముఠాలు ఉచ్చులు పన్నుతుంటే మరోవైపు సరదా కోసం గన్నులు చేతబట్టుకుని అడవుల్లోకి దూరుతున్న బ్యాచ్‌లు పెరిగిపోయాయి. ఆర్డర్లపై వణ్యప్రాణుల మాంసాన్ని వాట్సాప్ గ్రూపుల్లో బుకింగ్ చేసే స్థాయికి ఇక్కడ వేట చేరుకుంది. తరచుగా వేటగాళ్లపై కేసులు నమోదవుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో క్రమంగా ఈ ప్రాంతంలోని అడవిలో వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా పులికి అడవిలో ఆహారం కరువై ఊర్ల వైపునకు వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
పాల్వంచరూరల్: జంతు గణన మొదలైన రోజే జిల్లాలో పెద్దపులి తిరుగుతున్నట్లు బయటపడడంతో భద్రాద్రి జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) డాక్టర్ బీమానాయక్ నేరుగా రంగంలోకి దిగారు. దట్టమైన అభయారణ్యంలో డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్, ఎఫ్‌డీఓ బాబుతో కలిసి ఎనిమిది కిలోమీటర్ల కాలినడకన తిరుగుతూ సిబ్బంది చేస్తున్న గణనను పరిశీలించారు. కిన్నెరసాని ఆభయారణ్యం రేగళ్ల రేంజ్, యానంబైల్ రేంజ్ పరిధిలో పర్యటించిన ఆయన పులుల పాదముద్రలు, ఇతర జంతువుల పాదముద్రల సేకరణపై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సర్వేలో రేగళ్ల రేంజర్ జశ్వంత్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఏడాది కాలంగా జిల్లాలో నివాసం ఏర్పర్చుకున్న పులికి ‘భద్ర’ అని నామకరణం చేయగా, అశ్వారావుపేట రేంజ్ కావడిగండి అటవీ ప్రాంతంలోకి ఏపీ రాష్ట్రం అడవి నుంచి మరో పెద్దపులి వచ్చినట్లు తెలుస్తోంది. ఏళ్ల క్రితం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగు పులులు ఉండగా, 2018లో చేపట్టిన గణనలో పులి జాడలు కనిపించలేదు. ఇక 2020నుంచి పులి సంచారం కనిపిస్తుండడంతో భద్రతపై దృష్టి సారించినట్లు డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్ తెలిపారు.
జిల్లా అడవుల నుంచి బయటకు?!
మళ్లీ పులి వేట


