నకిలీల వసూళ్లతో తలనొప్పి
భద్రాద్రి రామయ్య ఫొటో..
ఆపై ఉత్సవాల పేరుతో వసూళ్లు
తాజాగా వైజాగ్ కల్యాణ మహోత్సవం రద్దు
అధికారుల ముందస్తు జాగ్రత్తలతోనే కట్టడి
భద్రాచలం: భద్రగిరి రామయ్య కల్యాణం పేరిట కొందరు చేస్తున్న వసూళ్లు తలనొప్పిగా మారాయి. ఇది గతంలో కేవలం ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలకే పరిమితం కాగా.. ఇప్పుడు ధర్మప్రచారం పేరుతో దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాన్ని అక్రమార్కులు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఏపీలోని విశాఖపట్నంలో ప్రచారరథం ద్వారా స్వామి వారి కల్యాణ మహోత్సవానికి అవకాశం కల్పిస్తే.. భద్రాచలం కల్యాణం పేరిట వసూళ్లు చేస్తున్నట్లు తెలిసి రద్దు చేయాల్సి వచ్చింది. గతంలోనూ ఇలాంటివి చోటుచేసుకోగా, కల్యాణాలు ఇతర పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్న వారిపై దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకుని భద్రాచల రామయ్యకు అప్రతిష్ట కలగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
ప్రచారంతో వసూళ్లు
భక్తులలో ఆధ్యాత్మికత పెంచడం, రామనామాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేవస్థానం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణానికి ఉన్న ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా భక్తులు, ధార్మిక సంస్థల వినతితో నిబంధనల మేరకు ఽప్రచార రథంలో ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి కల్యాణం నిర్వహిస్తారు. ఇందుకోసం దేవస్థానానికి రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంతో రామయ్య కల్యాణం పలు రాష్ట్రాల్లో జరుగుతుండడంతో రామయ్యే తమ చెంతకు వచ్చాడని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో ఈనెల 24న ప్రచార రథంతో శోభాయాత్ర, 25న స్వామివారికి అష్టోత్తరం, కల్యాణం, సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు. ఆతర్వాత రామయ్య కల్యాణం సందర్భంగా మంగళ సేవ పేరుతో రూ.11,116, అనుగ్రహ కల్యాణ నిమిత్తం రూ.5,116 చెల్లించాలని ఇన్‌స్టాలో ప్రచారం చేస్తూ వసూలు చేస్తున్నట్లు ఆలయ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈఓ దామోదర్‌రావు కల్యాణాన్ని రద్దు చేయించడమే కాక బాధ్యులు చెల్లించిన రూ.25వేలను అపరాధ రుసుముగా దేవస్థానం ఖాతాలో జమ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
పేటెంట్ హక్కులు
దశాబ్ద కాలంగా దేశ, విదేశాల్లో స్వామి మూలమూర్తులను పోలిన విధంగా విగ్రహాలకు నిత్యకల్యాణాలు, ప్రత్యేక పూజలు చేస్తూ కొన్ని సంస్థలు ధనార్జనకు దిగాయి. ఓ సంస్థ బాధ్యులైతే ‘ఖగోళ యాత్ర’ పేరుతో భద్రాచలం శ్రీరామ పేరుతో వెబ్‌సైట్ రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా నిత్యకల్యాణాలు నిర్వహిస్తామంటూ విరాళాలు సేకరించారు. ఇందుకోసం భద్రాచలం మూలమూర్తుల ఫొటోలను వాడడడంతో నాటి ఈఓ ఎల్.రమాదేవి దృష్టి సారించారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా భద్రాచలం ఆలయం మాత్రమే ప్రత్యేకమైన రాముడి మూలమూర్తుల చిత్రాలు ఉపయోగించేలా పేటెంట్ హక్కులు సాధించారు. తద్వారా మూలమూర్తుల చిత్రాలు, బొమ్మలను బయట ప్రాంతాలలో వినియోగించడం నేరమవుతుంది. ఒకవేళ ఆధ్యాత్మిక అవసరాలకు, ఉచితంగా పంపిణీకి చిత్రాలు వినియోగించుకోవాలంటే దేవస్థానం అనుమతి తీసుకునేలా నిబంధన విధించారు.
ఇలా చేస్తే మేలు..
స్వామి వారి కల్యాణ మహోత్సవం జరపాలనుకునే ధార్మిక సంస్థలు, భక్త సంఘాలకు అనుమతి ఇచ్చే ముందు పూర్తిగా ఆరా తీస్తేనే అక్రమార్కులకు కట్టడి చేయడం వీలవుతుంది. అలాగే, స్వామి వారి కల్యాణాన్ని ఆసరాగా చేసుకొని వసూళ్లకు పాల్పడే వారు, మూలమూర్తుల చిత్రాలను ఉపయోగించే వారిపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. తద్వారా నగదు వసూళ్లే లక్ష్యంగా రంగంలోకి దిగే వారిని కట్టడి చేయొచ్చని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
భద్రాచలం రాముడి పేరు, చిత్రాలను దుర్వినియోగం చేస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాగే వ్యవహరిస్తున్నట్లు తేలడంతో వైజాగ్‌లో కల్యాణాన్ని రద్దు చేసి జరిమానా విధించాం. రాముడి మూలమూర్తులపై పేటెంట్ హక్కులు దేవస్థానానికి ఉన్నాయి. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.
– కొల్లు దామోదర్‌రావు, ఈఓ, రామాలయం
నకిలీల వసూళ్లతో తలనొప్పి


