పాల్వంచలోగప్‌చుప్
టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో ఆశావహులు కొత్తగూడెం, సుజాతనగర్‌లో రాజుకున్న వేడి పాల్వంచలో అంతగా కనిపించని ఎన్నికల వాతావరణం
త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగూడెం మేయర్ పీఠంపై కూర్చునే అవకాశం ఎస్టీ అభ్యర్థులకు వచ్చింది. ఈ మేరకు ఆయా పార్టీల్లో ఉన్న ఎస్టీ వర్గానికి చెందిన ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. రిజర్వేషన్ కారణంగా మేయర్ పదవికి దూరమైన వారు మరో కీలక పదవి అయిన డిప్యూటీ మేయర్ హోదా కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఒకప్పటి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల(ప్రస్తుత 29 డివిజన్లు)తో పాటు నిన్నామొన్నటి వరకు గ్రామపంచాయతీగా ఉన్న సుజాతనగర్ మండలంలోని ఏడు విలీన గ్రామాల(ప్రస్తుత నాలుగు డివిజన్లు)లోనూ ఎన్నికల వేడి రాజుకుంది. కానీ, ఐడీఓసీ, మెడికల్ కాలేజీ, మన్మోహన్‌సింగ్ యూనివర్సిటీ వంటివి కొలువై ఉన్న పాల్వంచలో పెద్దగా హడావుడి కనిపించడం లేదు.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
పాల్వంచ పట్టణ వ్యూ
మూడు దశాబ్దాలుగా ఎన్నికలకు దూరం..
1987లో పాల్వంచ మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఆ తర్వాత రెండు సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అయితే పాల్వంచ మున్సిపాలిటీగా మార్చిన ప్రాంతం షెడ్యూల్డ్ ఏరియాలో ఉందంటూ గిరిజన సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో 1996 తర్వాత ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. పలుమార్లు ఎన్నికల కోసం ప్రయత్నం జరిగినా.. అవి సఫలం కాలేదు. దీంతో గడిచిన 30 ఏళ్లుగా పాల్వంచ మున్సిపాలిటీకి పాలకమండలి లేదు. అఽధికారులే నేరుగా ఇక్కడ పురపాలన సాగిస్తున్నారు. అయితే 2025లో తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండంలోని ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా పాల్వంచ పరిధిలో 27 డివిజన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్తగూడెం పరిధిలో రాజకీయంగా కోలాహలం మొదలైంది. రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆయా పార్టీల వారీగా తమ గాడ్‌ఫాదర్ల ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో కేడర్‌ను సన్నద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ తరహా కోలాహలం పాల్వంచ పరిధిలో కనిపించకపోవడం గమనార్హం.
కీలక పదవి దక్కే అవకాశమున్నా..
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తంగా 1.34లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 61 వేల మంది పాల్వంచ పరిధిలో ఉన్నారు. సాధారణంగా ఒక ప్రాంతానికి చెందిన వారు మేయర్‌గా ఉంటే మరో ప్రాంతానికి చెందిన వారికి డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించే ఆనవాయితీని కొనసాగిస్తారు. ఈ క్రమంలో పాల్వంచ ప్రాంతానికి కచ్చితంగా ఓ కీలక పదవి దక్కే అవకాశం ఉంది. అయినప్పటికీ కొత్తగూడెం, సుజాతనగర్ విలీన గ్రామాలతో పోల్చితే పాల్వంచ పట్టణంలో ఎన్నికల హడావుడి తక్కువగా కనిపిస్తోంది. 30 ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరకగపోవడంతో స్థానిక నాయకత్వంలో స్తబ్ధత ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో లాగానే ఈసారి కూడా ఎన్నికలు వాయిదా పడతాయేమో అనే సందేహాలతో పాటు ముందుగా హడావుడి చేయడం, ఎన్నికల సన్నాహాల పేరుతో జేబులు ఖాళీ కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదనే అభిప్రాయమూ ఇక్కడి నాయకుల్లో నెలకొంది. ఫలితంగా టికెట్లు, కీలక పదవుల కోసం ప్రయత్నాలు, రాజకీయపరమైన ‘కూడికలు – తీసివేతలు’ వంటి హడావుడి పాల్వంచలో అంతగా కనిపించడం లేదు.
జిల్లా కేంద్రంలో మొదలైన ఎన్నికల హడావుడి
పాల్వంచలోగప్‌చుప్
పాల్వంచలోగప్‌చుప్


