భవన నిర్మాణాలకు స్థలాలు గుర్తించండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలతో పాటు మండల సమాఖ్య భవన నిర్మాణాలకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కరకగూడెం మండలాల్లో 400 చదరపు గజాల భూమిని గుర్తించాలన్నారు. చండ్రుగొండ, ఇల్లెందు, ములకలపల్లి, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట మండలాల్లో ఆహార ధాన్య నిల్వ గోదాముల నిర్మాణానికి 450 చదరపు గజాల చొప్పున భూ సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో 200 చదరపు గజాల విస్తీర్ణంలో లైవ్‌లీహుడ్ వర్క్‌షెడ్‌ల నిర్మాణం ద్వారా మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, మహిళా సమాఖ్య భవనాల సమీపంలో అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. స్థల సేకరణలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దాతలు ఎవరైనా ఇస్తే చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారమే మాత్రమే భూములు స్వీకరించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో స్థల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల సెన్సెస్ సర్వే జాతీయ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని చిన్న నీటిపారుదల వనరుల వివరాలను సేకరించి యాప్‌లో నమోదు చేయాలని, ఈనెల 25లోగా సర్వే పూర్తి చేయాలని చెప్పారు. వీసీలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే పిల్లలకు బంగారు భవిష్యత్తు..
కొత్తగూడెంఅర్బన్: చదువుతోనే పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించే అవకాశం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి రామవరంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల లభ్యత, బోధనా విధానాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు, విద్యా వనరులు అందిస్తామని తెలిపారు. గిరిజన విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పాఠశాలలో క్రీడా మైదానం అభివృద్ధి, క్రీడా పరికరాల లభ్యత, విద్యార్థుల శారీరక ఆరోగ్యం, క్రీడల ద్వారా క్రమశిక్షణ పెంపొందించే అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. అనంతరం మెస్‌ను పరిశీలించి ఆహార నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తగిన పోషకాహారం తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు.


