సమయపాలన పాటించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
దమ్మపేట : ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. దమ్మపేట మండలం పార్కలగండి, పెద్దగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. పార్కలగండిలో విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశాక వారితో కలిసి కాసేపు హాకీ ఆడారు. అనంతరం మాట్లాడుతూ.. పాఠశాల ప్రాంగణం, వంట, వసతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, తరగతులు కొనసాగే సమయంలో విద్యార్థులు ఇళ్లకు వెళ్లకుండా చూడాలని, డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ అశోక్, ఏటీడీఓ చంద్రమోహన్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, హెచ్‌ఎంలు రవి, చంద్రకళ పాల్గొన్నారు.
సకాలంలో వైద్యం అందించాలి..
భద్రాచలం: మారుమూల గ్రామాల నుంచి ఆస్పత్రికి వచ్చే వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని పీఓ రాహుల్ అన్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయంటూ ఓపీ, వార్డుల్లో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేలా డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణులను వారి గ్రామాల నుంచి అంబులెన్సులో తీసుకురావాలని, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ రకాల పరీక్షల కోసం పేషెంట్లను ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపొద్దని, ఇలాంటివి తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ అంబులెన్సులు ఉండడంతో వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల లైసెన్స్, ఇతర సర్టిఫికెట్లను తనిఖీ చేయాలని, సక్రమంగా లేకుంటే అంబులెన్స్‌లను సీజ్ చేయాలని ఆర్‌టీఓ సంగం వెంకటపుల్లయ్యకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, ఆర్‌ఎంఓలు రాజశేఖర్‌రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


