రామయ్య అనుగ్రహంతోనే యాత్ర
రైతులు, భూమి, సమాజ క్షేమమే లక్ష్యం
త్రిదండి చినజీయర్‌స్వామి
నేలకొండపల్లి: అందరూ ఆరోగ్యంగా ఉండడమే కాక భూమి, రైతులు, సమాజం కోసమే సుఫలా యాత్ర చేపట్టినట్లు త్రిదండి చినజీయర్ స్వామి పేర్కొన్నారు. నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయం నుంచి భక్త రామదాసు ధ్యాన మందిరం వరకు మంగళవారం రైతులు, భక్తులతో కలిసి ఆయన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్‌స్వామి మాట్లాడుతూ రామచంద్రుడి అనుగ్రహంతో యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు, స్వప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. అందరిని పోషించే భూమిలో రెండు, మూడు పంటలు పండిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఈ విషయమై అవగాహన కల్పించడం, మానవుల్లో ఆలోచనలు చెడకుండా చూడడం, ప్రకృతిని కాపాడుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే మంచి భూమి, నీరు ఇవ్వాల్సిన అవసరముందని చెప్పారు.
వెంట నడిచిన భక్తులు
యోగా విద్యాలయం నుంచి రామదాసు ధ్యాన మందిరం వరకు స్వామి చేపట్టిన సుఫలాయాత్రలో భక్తులు, రైతులు వెంట నడిచారు. రామదాసు మందిరం వద్ద భక్తులు స్వాగతం పలకగా, మందిరంతో పాటు రామదాసు కాంస్య విగ్రహం వద్ద పూజలు చేశారు. అలాగే, రామదాసు జయంతి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అక్కడి ఆడిటోరియంలో కూడా చినజీయర్ స్వామి మాట్లాడగా 100 దేశీయ ధాన్య రకాలు, సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్‌టీఐ కమిషనర్ పి.వి.శ్రీనివాస్, సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణతో పాటు నల్లమల వెంకటేశ్వరరావు, డాక్టర్ కె.వై.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
రామయ్య అనుగ్రహంతోనే యాత్ర


