సంక్రాంతి సంబురం
● ఆర్టీసీ రీజియన్‌కు రూ.19.80 కోట్ల ఆదాయం ● అదనపు సర్వీసుల ద్వారానే రూ.5.42 కోట్లు ● బస్సుల్లో 22.52 లక్షల మంది ప్రయాణం
ఖమ్మంమయూరిసెంటర్ : సంక్రాంతి పండుగ ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌కు గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అదనపు సర్వీసులతో కలిపి ఆర్టీసీకి రూ.19.80 కోట్ల ఆదాయం సమకూరింది. ఈనెల 9నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాకు, ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు ఏడు డిపోల ద్వారా బస్సులు నడిపించారు. డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు, సిబ్బంది సమన్వయంగా వ్యవహరిస్తూ సంక్రాంతి సెలవులు మొదలుకాగానే ఈనెల 9నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాలకు ప్రయాణికులను చేర్చారు. పండుగ ముగిశాక 15నుంచి 19వ తేదీ వరకు వరకు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు బస్సులు నడిపించారు. మొత్తంగా 676 రిజర్వేషన్ సర్వీసులు, 807 రిజర్వేషన్ లేని సర్వీసులు కలిపి 1,483 అదనపు సర్వీసులు కొనసాగాయి. రీజియన్ పరిధిలోని ఏడు డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, సెక్యూరిటీ, విజిలెన్స్ సిబ్బంది, సూపర్‌వైజర్లు, డిపో మేనేజర్లు అవిశ్రాంతంగా పనిచేయడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు.
ఈనెల 9నుంచి 19 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్‌కు, ఇక్కడి నుంచి హైదరాబాద్ నడిపించిన బస్సులు 29.97 లక్షల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించాయి. దీంతో అదనపు సర్వీసులతో కలిపి రూ.19.80 కోట్ల ఆదాయం చేకూరింది. మొత్తం 22.52 లక్షల మంది ప్రయాణించగా అందులో 12.52 లక్షల మంది మహిళలు ఉన్నారు. రిజర్వేషన్ సర్వీసులకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా 676 అదనపు సర్వీసులకు రిజర్వేషన్ కల్పించారు. హైదరాబాద్ నుండి వచ్చే ప్రయాణికుల కోసం 411రిజర్వేషన్ సర్వీసులు, తిరుగు ప్రయాణంలో 265 సర్వీసులను నడిపించారు. కాగా, రీజియన్ పరిధిలో 1,413 అదనపు సర్వీసులు నడిపించాలని తొలుత ప్రణాళిక రూపొందించినా రద్దీ దృష్ట్యా 1,483 సర్వీసులు నడిపించాల్సి వచ్చింది.
సంక్రాంతి సంబురం


