నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
25న వైజాగ్‌లో కల్యాణం..
భక్తుల కోరిక మేరకు ఈనెల 25న విశాఖపట్టణంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కె.దామోదర్‌రావు తెలిపారు. 24వ తేదీన ప్రచార రథంతో శోభాయాత్ర, 25న వైజాగ్‌లోని వియ్ వైశ్య అగస్త్య, గాదిరాజ్ ప్యాలెస్‌లో కల్యాణం, సాయంత్రం ఊంజల్ సేవ ఉంటాయని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో
సామర్థ్యం పెంచాలి
అశ్వారావుపేటరూరల్: చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిలో సామర్థ్యాలు పెంచేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని డీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేటమాలపల్లి, అటెండర్స్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మంగళవారం ఆమె సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలు, ఎఫ్‌ఎల్‌ఎస్, మధ్యాహ్న భోజనం, హాజరు, ఇతర రికార్డులను తనిఖీ చేశాక మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, ఎంఈఓ ప్రసాదరావు, హెచ్‌ఎం పి.హరిత, సీఆర్‌పీ ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో డిగ్రీ, పీజీ, ఇతర ఉన్నత చదువులు చదివే దివ్యాంగ విద్యార్థులు ల్యాప్‌టాప్, ట్యాబ్ తదితర ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధులు, బధిరులు, శారీరక దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హతగల వారు http: obmms వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 6301981960, 8331006010 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


