పందేనికి సై!
హద్దు దాటితే..
ఆంధ్రప్రదేశ్‌లో ఆటలకు
తెలంగాణ పుంజులు సిద్ధం
ఇప్పటికే సామగ్రి సిద్ధం చేసుకున్న
పందెం రాయుళ్లు
సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా
బిర్రుల ఏర్పాటు పనులు
చర్యలు తీసుకుంటాం
అశ్వారావుపేటరూరల్/చర్ల/బూర్గంపాడు: సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. సరిహద్దుల్లో కోడి పందేలకు బిర్రులు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ సరిహద్దులోని ఏపీ గ్రామాల్లో, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో జోరుగా కోడి పందేలు సాగనున్నాయి. మూడు రోజులపాటు రాయుళ్ల వాహనాలు అటువైపే బారులుదీరనున్నాయి. రసవత్తరంగా సాగే పందేల్లో బరిలో దించే పుంజులను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తోటల్లో పెంపకం..
సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని పిల్ల దశ నుంచే కోళ్లను ప్రత్యేకంగా పెంచారు. ఏపీలోని పశ్చిమ, తూర్పు గోదావరి, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరుతోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఒక్కో గుడ్డు రూ.500 నుంచి సుమారు రూ.3వేల దాకా ధర పెట్టి కొనుగోలు చేసి, తెలంగాణలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో పొదిగించి ఆయిల్‌పాం, మామిడి తోటల్లో ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఒక్కో కేంద్రంలో 100 నుంచి 150 వరకు కోడి పుంజులు ఉన్నాయి. పండుగకు రావడంతో పందెంరాయుళ్లు కోడి పుంజుల కోసం పెంపకందారులను ఆశ్రయిస్తున్నారు.
ప్రత్యేక ఆహారం..
కోడి పుంజులకు మూడు నెలల ముందు నుంచే ప్రత్యేక ఆహారం, శిక్షణ ఇస్తారు. ఉడకబెట్టిన గుడ్డు, ఖరీదైన జీడి పప్పు, పిస్తా, బాదం, రాగులు, సజ్జలు, వడ్లు తినిపిస్తారు. వారానికోరోజు మాంసహారం(మటన్) కై మా, మిగిలిన రోజుల్లో ఆకు కూరలతో ఆహారాన్ని అందిస్తారు. పుంజు శారీరకంగా బలపడేందుకు నీటి తొట్టెలో ప్రత్యేకంగా ఈత కొట్టించడంతో చన్నీళ్లతో స్నానం చేయిస్తారు. ఆరోగ్య సమస్యలు రాకుండా వ్యాక్సిన్లు, మందులు కూడా ఇస్తారు.
ధర రూ. లక్ష వరకు..
బరిలో దింపే కోడి పుంజు కనీసం ఐదు కేజీల బరువు, ఏడాదిపైనే వయస్సు ఉండేలా చూస్తుంటారు. కాకి, నెమలి, డేగ, సీతువా, పచ్చకాకి, కోడి డేగ, ఆబ్రాసు, రసంగి డేగ వంటి జాతి కోళ్లనే బరిలో దించుతారు. దీంతో ధర కూడా ఉంటోంది. పుంజు ధర రూ.15 వేల నుంచి రూ.80 వేలు, రూ.లక్ష వరకు ఉంటోంది. కొందరు నెల, రెండు నెలల క్రితమే పుంజులను కొనుగోలు చేయగా, మరికొందరు ప్రస్తుతం కొంటున్నారు.
పందేలు మూడు రకాలు..
కోడి పందేల్లో మూడు రకాలు ఉంటాయి. వీటిలో ముసుగు పందెం, జోడి పందేలు, చూపుడు పందేలు ఉన్నాయి. ముసుగు పందెంలో బరిలో దించే కోళ్లకు ముసుగు వేసి పందెం కడుతారు. ఇరు పక్షాల మధ్య పందెం కుదిరితే నేరుగా కోడి పుంజును బరిలో దించుతారు. జోడి పందెంలో పందెం వేసే వారి వద్ద కనీసం ఐదు కోడి పుంజులు ఉండాలి. వరుసగా ఐదు పందేలు వేయాల్సి ఉంది. ఇక చివరిగా చూపుడు పందెం. బరిలో ఉన్న రెండు పుంజులను చూసి తమకు ఇష్టమైన వాటిపై పందెం వేస్తుంటారు.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో...
చర్ల: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూడా కోడి పందేలకు స్థావరాలు సిద్ధమవుతున్నాయి. సరిహద్దు గ్రామాలైన కుర్నపల్లి, బోదనెల్లి, వీరాపురం, తిప్పాపురం, కొండెవాయి, తిమ్మిరిగూడెం, బక్కచింతలపాడు, గీసరెల్లి, ఉయ్యాలమడుగు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పందేల సమయంలో మద్యం, గుడుంబా కూడా జోరుగా విక్రయించనున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూర్ జిల్లాలు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తెలంగాణాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి పందె రాయుళ్లు కోడిపందాలు ఆడేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వాహనాలను సమీప గ్రామాల్లో ఉంచి అక్కడి నుంచి స్థావరాలకు కాలికనడకన వెళ్లునున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పోలీసులు దాడి చేసినా సులువుగా తప్పించేకునేలా నిర్వాహకులు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.
బూర్గంపాడు సమీపంలో..
బూర్గంపాడు సమీపంలోని ఏపీ గ్రామాల్లో కూడా బిర్రులు సిద్ధమవుతున్నాయి. బూర్గంపాడుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీధర గ్రామంలో అధిక సంఖ్యలో బిర్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పేకాట, గ్యాంబ్లింగ్ ఆటలు కూడా నిర్వహిస్తారు. డోజర్లు, జేసీబీలతో 20 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. జిల్లావాసులే ఎక్కువ మంది శ్రీధర వెళ్లనుండగా, ఏపీ పోలీసులు మూడురోజులపాటు కోడి పందేలను లైట్‌గా తీసుకుంటారు. తెలంగాణ పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘా పెడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెడుతున్నారు. తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉప్పుసాక సమీపంలో దాడులు నిర్వహించి ఎనిమిదిమంది పందెం రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఏటా కోడి పందేలు నిర్వహించడం సాధారణమే. అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెం, అనంతారం, గాండ్లగూడెం, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, నారంవారిగూడెం, అచ్యుతాపురం, నందిపాడు, కుడుములపాడు, కొత్తూరు గ్రామాలు, దమ్మపేట మండలంలోని ముష్టిబండ, అల్లిపల్లి, మొద్దులగూడెం గ్రామాలకు ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి, చింతలపూడి మండలాలు సరిహద్దులోనే ఉంటాయి. కూత వేటు దూరం, రోడ్డు దాటితే ఏపీ హద్దుల్లోకి వెళ్లే చోట పందేలు జోరుగా నిర్వహిస్తారు. దీంతో పండుగ మూడు రోజులపాటు స్థానికులు సరిహద్దు దాటి పందేలకు వెళ్తుంటారు.
సంక్రాంతి వేళ సరిహద్దుల్లో
జోరుగా కోడి పందేలు
సరిహద్దుల్లో కోడి పందేలకు ఏర్పాట్లు చేస్తున్న ప్రాంతాలు అటవీ ప్రాంత గ్రామాలు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడంతో కొంత ఇబ్బందిగా మారింది. అయినా ఉన్నతాధికారుల సూచనల మేరకు పటిష్ట భద్రతతో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాం. పూర్తి స్థాయిలో కోడి పందేలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటాం.
–రాజువర్మ, చర్ల సీఐ
పందేనికి సై!
పందేనికి సై!
పందేనికి సై!


