కొత్త.. కిలకిలలు | - | Sakshi
Sakshi News home page

కొత్త.. కిలకిలలు

Jan 11 2026 7:35 AM | Updated on Jan 11 2026 7:35 AM

కొత్త.. కిలకిలలు

కొత్త.. కిలకిలలు

370 రకాల జాతులు ఉన్నట్లు గుర్తింపు ఔత్సాహికుల కోసం బర్డ్స్‌ వాక్‌, నేచర్‌ వాక్‌ నిర్వహణ

ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధి పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, చంద్రుగొండ మండలాల్లో 35వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పులిగుండాల అటవీ ప్రాంతం(కనకగిరి గుట్టలు)లో అరుదైన పక్షులు ఆవాసం ఏర్పాటుచేసుకున్నాయి. భిన్నమైన వృక్షాలు, మొక్కలే కాక జలపాతాలు, జలాశయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాక మచ్చల జింకలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, సాంబార్‌ వంటి జంతువులతో పాటు అరుదైన పక్షి జాతులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

భిన్నమైన పక్షి జాతులు

పులిగుండాల అటవీ ప్రాంతంలో వాతావరణం, వృక్ష సంపద, నీటి వనరుల కారణంగా భిన్నజాతుల పక్షులు జీవనం సాగిస్తున్నాయి. కొన్ని స్థిరనివాసం ఏర్పాటుచేసుకోగా, మరికొన్ని పక్షులు సీజన్ల వారీగా వచ్చివెళ్తున్నాయని గుర్తించారు. ఆగ్నేయాసియా, ఈశాన్య భారత దేశంలో మాత్రమే నివసించే ప్లమ్‌ హెడెడ్‌ పారకీట్‌(చిలుక జాతి) పక్షిని ఈ అడవుల్లో ఇటీవల గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా అడవుల్లో నివసించే షిక్రా పక్షి కూడా సంచరిస్తున్నట్లు తేలింది. ఇవికాక కుటుంబానికి చెందిన ఇండియన్‌ ప్యారడైజ్‌ ఫ్లైక్యాచర్‌ పక్షి ఇక్కడ తరచుగా కనిపిస్తోంది. కామన్‌, వైట్‌–త్రోటెడ్‌, పైడ్‌, బ్లూ– ఎర్ట్‌ కింగ్‌ఫిషర్లు కూడా ఉన్నాయి. పెద్దనీటి పక్షులుగా చెప్పుకునే హెరాన్‌లు ఇక్కడి సరస్సుల్లో కనిపిస్తున్నాయి. వీటిలో పర్పుల్‌ హెరాన్‌, గ్రే హెరాన్‌లు ఉన్నాయి. ఇంకా టికెల్స్‌ బ్లూ ఫ్లైక్యాచర్‌, ఏషియన్‌ బ్రౌన్‌ ఫ్లై క్యాచర్‌ వంటి పేర్ల కలిగిన పక్షి జాతులు ఉన్నట్లు నిపుణులు, అటవీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు సైబేరియా నుంచి ఆస్ప్రె(గద్ద జాతి) పక్షులు, యూరప్‌ నుంచి నాలుగు రకాల గోరింకలు చలికాలంలో వచ్చి ఫిబ్రవరిలో వెళ్తుంటాయని తేలింది.

పక్షి వీక్షణ కేంద్రంగా అభివృద్ది

పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేస్తూనే అరుదైన పక్షులు ఉన్నందున పక్షి వీక్షణ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. మిరాకీ, అటవీ బర్డ్స్‌ ఎన్జీవోస్‌ సంస్థలు ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. చలికాలంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఇక్కడ మకాం వేసి అత్యాధునిక పరికరాలతో పక్షులను పరిశీలిస్తూ అందులో అరుదైన రకాలను గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యాన సాధారణంగా ఉండే పక్షులతో పాటు మొత్తంగా 370 రకాల పక్షులు ఈ అడవుల్లో ఉన్నట్లు మిరాకీ సంస్థ బాధ్యులు చెబుతున్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు

పక్షులు, జంతువులకు ఆవాసంగానే కాక ప్రత్యేక అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో పులిగుండాలకు సందర్శకులు పెరుగుతున్నారు. ఈనేపథ్యాన పక్షులు, జంతుల ప్రేమికుల కోసం అటవీ అధికారులు బర్డ్‌ వాక్‌, నేచర్‌ వాక్‌ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బర్డ్‌ వాక్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 60మందికి హాజరయ్యారు. ఈ ప్రాంతం 27 కి.మీ. రహదారితో ఉండడంతో సఫారీ వాహనాలను సమకూర్చగా, బోటింగ్‌ ఏర్పాటుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది.

అరుదైన పక్షుల ఆవాసంగా పులిగుండాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement