కాంగ్రెస్‌ది పేదల ప్రభుత్వం
● పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న
పాల్వంచ: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న అన్నారు. శనివారం వజ్రా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడం అనైతికమని పేర్కొన్నారు. పేరు తొలగింపును నిరసిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రానున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలోని అన్ని పార్టీ పదవులు రద్దయ్యాయని, పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించేలా చూస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు నాగ సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, వూకంటి గోపాలరావు, నూకల రంగారావు, కొండం వెంకన్న, యర్రంశెట్టి ముత్తయ్య, సాధం రామకృష్ణ, చీకటి కార్తీక్, అభినవ పాల్గొన్నారు.
జాతీయ ఉపాధ్యక్షుడిగా సంజయ్
టేకులపల్లి : బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ (బీఏఎన్‌ఏఈ ) జాతీయ ఉపాధ్యక్షుడిగా మండలంలోని బోడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోత్ సంజయ్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం నవీ ముంబైలో జరిగిన ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎన్నుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. సంజయ్ హైదరాబాద్‌లోని ఏఐఎంఎల్ వొక్సెన్ యూనివర్సిటీలో హెచ్‌ఓడిగా పనిచేస్తున్నాడు.
వ్యక్తి ఆత్మహత్య
దుమ్ముగూడెం : దుమ్ముగూడెం గ్రామానికి చెందిన ఎనగంటి శివకుమార్(30) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆచూకీ కోసం వెతుకుతుండగా దుమ్ముగూడెం గ్రామంలోని ఎస్‌ఎల్‌ఎస్ పవర్ ప్లాంట్ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. మద్యం మత్తులో శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తూ మృతుడి తండ్రి చంద్రం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


