గిరిజనులకు ప్రత్యేకం!
ప్రతిభ చాటే అవకాశం
ఉమ్మడి జిల్లాలో పలువురికి అవకాశం
● ‘ఖేలో ఇండియా’లో క్రీడాపోటీల నిర్వహణకు నిర్ణయం ● ఏడు అంశాల్లో జాతీయస్థాయి పోటీలు ● గిరిజన క్రీడాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు
ఖమ్మం స్పోర్ట్స్: గిరిజన యువతలో సహజసిద్ధంగా దాగి ఉండే క్రీడా ప్రతిభను వెలికితీయడం, ఔత్సాహికుల ప్రతిభను తెరపైకి తీసుకురావడమే లనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఖేలో ఇండియా పోటీల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయించింది. జాతీయ స్థాయిలో కేవలం గిరిజన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేలా పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 177 జిల్లాలో గిరిజనులు ఉండగా, ప్రత్యేక పోటీలతో ప్రతిభావంతులను గుర్తించొచ్చని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ నిర్వహించనుండగా, ప్రస్తుతం వయోబేధం లేకుండా మహిళలు, పురుషులు పాల్గొనేలా ఏడు క్రీడాంశాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్‌బాల్ క్రీడాంశాలు ఉన్నాయి.
తొలుత రాష్ట్రస్థాయిలో ఎంపిక
రాష్ట్రస్థాయిలో ఎంపికై న క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు తీసుకుంటారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక నిష్పక్షపాతంగా ఎంపిక జరిగేలా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఒకరు, గిరిజన సంక్షేమం / సాంఘిక సాంక్షేమ శాఖ ఓ అధికారి, తెలంగాణ క్రీడా సంఘం తరపున ఇంకొకరితో పాటు ద్రోణాచార్య / అర్జున అవార్డు గ్రహీత, లేదా కోచ్‌కు ఈ కమిటీలో స్థానం కల్పిస్తారు. తుది జాబితాలో దేశవ్యాప్తంగా 2,500 మంది క్రీడాకారులకు స్థానం కల్పించడమే కాక ప్రత్యేకంగా స్పోర్ట్స్ కిట్స్ అందించనున్నారు.
జాతీయస్థాయిలో ఇప్పటికే పతకాలు సాధించిన క్రీడాకారులు ప్రతిభ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఖేలో ఇండియా క్రీడల ద్వారా సత్తా చాటితే తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాక ఫెడరేషన్లు ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు తెరపైకి రాలేకపోయిన గిరిజన క్రీడాకారులకు ఇకనైనా గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉంది. – పుట్టా శంకరయ్య,
జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీ సభ్యుడు
గిరిజన, ఆదివాసీ జనాభా ఉమ్మడి జిల్లాలో అధికంగానే ఉంటుంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్చరీ శిక్షణకు ఖేలో ఇండియా సెంటర్ ఉండగా, కాచనపల్లి, కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూళ్లలో కూడా ఆర్చరీ శిక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యాన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన, ఆదివాసీ యువత ఇప్పటికే జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రధానంగా ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రభుత్వం, ఐటీడీఏ ప్రోత్సాహం, స్పోర్ట్స్ స్కూళ్లలో శిక్షణతో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఖేలో ఇండియాలో ప్రత్యేకంగా గిరిజనుల కోసం జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనుండడంతో వీరికి మంచి వేదికగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గిరిజనులకు ప్రత్యేకం!


