మహిళల రక్షణకు జీఆర్సీలు కీలకం
సూపర్‌బజార్(కొత్తగూడెం): గ్రామీణ ప్రాంత మహిళలు గృహహింస, లైంగిక వేధింపులు, సామాజిక, ఆర్థిక సమస్యలకు గురైనప్పుడు వారికి రక్షణగా నిలిచేందుకు జెండర్ రిసోర్స్ సెంటర్లు(జీఆర్సీ) కీలకంగా ఉపయోగపడతాయని డీఆర్‌డీఓ విద్యాచందన అన్నారు. జీఆర్సీల అమలుపై అవగాహన కల్పించేందుకు గురువారం కలెక్టరేట్‌లో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో తొలి దశలో భద్రాచలం, మణుగూరు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాలకు జీఆర్సీలు మంజూరయ్యాయని తెలిపారు. మహిళా హక్కులు, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించడం, మానసిక ఒత్తిడికి గురైన బాధితులకు నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించడం వంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామ, మండల సమాఖ్యల్లోని సభ్యులతో సామాజిక కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేస్తామని, గ్రామ స్థాయిలో ముగ్గురు, మండల స్థాయిలో ఐదుగురు సభ్యులను నియమిస్తామని చెప్పారు. ఈ సభ్యులకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. ప్రతీ గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీఆర్‌సీల్లో సభ్యులు అందుబాటులో ఉంటారని వివరించారు. కార్యక్రమంలో ట్రెయినీ డీపీఓ బి.అనూష, జెండర్ ట్రైనర్ జమున, సెర్ప్ జెండర్ డీపీఎం లింగయ్య గౌడ్, డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ రూప తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ విద్యాచందన


