జాబ్‌మేళాలో 10 మందికి ఉద్యోగాలు
రుద్రంపూర్: కొత్తగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అపోలో హైదరాబాద్ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన జాబ్‌మేళాలో ఉద్యోగాలకు ఎంపికై న 10 మందికి గురువారం నియామక పత్రాలు అందజేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి(డీఈఓ) కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. అపోలో కంపెనీలో జూలూరుపాడు, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో ఖాళీగా ఉన్న ఫార్మసీ అసిస్టెంట్ 100 పోస్టులకు 25 మంది హాజరు కాగా.. 10 మందిని కంపెనీవారు ఎంపిక చేశారన్నారు. వీరికి వేతనం రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించనున్నట్లు తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
పాల్వంచరూరల్: పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మండల పరిధి లోని కోడిపుంజులవాగు గ్రామ శివారులో గురువారం పేకాటస్థావరంపై రూరల్ ఎస్‌ఐ సురేశ్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. దీంతో పేకాట ఆడుతున్న జాటోత్ అశోక్, అజ్మీర కల్యాణ్, హలవత్ బాలాజీ, గురులోత్ సక్రు, తోట్ల సంపత్ పట్టుబడగా.. గుగులోత్ లాలు తప్పించుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.18,260 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
దాడి కేసులో వ్యక్తి..
టేకులపల్లి: దాడి కేసులో టేకులపల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టేకులపల్లి ఎస్‌ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ పరిధిలోని పాత తడికలపూడి గ్రామంలో గత నెల 16న ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఈసం వంశీరామ్‌ను అదే గ్రామానికి చెందిన జార కల్యాణ్ ఇనుప రాడ్డుతో కొట్టడంతో వంశీ తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో టేకులపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదవగా.. గురువారం నిందితుడు కల్యాణ్‌ను అరెస్టు చేసి ఇల్లెందు కోర్టుకు, ఆ తర్వాత జైలుకు తరలించారు.
దుప్పిని చంపిన కేసులో ఇద్దరి రిమాండ్
పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యంలో గత మూడు నెలలక్రితం దుప్పిని చంపిన కేసులో ఇద్దరికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. యానంబైల్ సెక్షన్ ఆఫీసర్ బి.కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. యానంబైల్ రేంజ్ పరిధిలోని మొండికట్ట బీట్‌లో గతేడాది అక్టోబర్‌లో మొండికట్ట గ్రామానికి చెందిన దేశెట్టి ఆంజనేయులు, వరాల ప్రసన్నకుమార్‌లు దుప్పిని హతమార్చారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం కొత్తగూడెం కోర్టులో హాజరు పర్చగా.. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో భద్రాచలంలోని సబ్‌జైలుకు తరలించినట్లు తెలిపారు.
ములకలపల్లి: కొండగొర్రె మాంసం విక్రయిస్తున్న నలుగురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) రవికిరణ్ కథనం మేరకు.. ములకలపల్లి మండలకేంద్రంలోని విజయపురి కాలనీలో బుధవారం రాత్రి వన్యప్రాణి మాంసం అమ్ముతున్నారనే సమాచారం రావడంతో దాడి చేయగా.. సంగం ఆది నారాయణ ఇంట్లో మాంసంతో పాటు తల, కాళ్లు స్వాధీనం చేసుకున్నారు. కాలనీకి చెందిన నారాయణతో పాటు గంపా సాంబయ్మ, కన్నెబోయిన శివ, సంగం వెంకన్నలను అదుపులోకి తీసుకున్నారు. ములకలపల్లి శివా రులోని అట వీ ప్రాంతంలో వేటకుక్కల సాయంతో కొండగొర్రెను హతమార్చినట్లు నిందితులు ఒప్పుకోవడంతో ఆ నలుగురిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారికి 15 రోజుల రిమాండ్ విధించగా.. భద్రాచలం సబ్‌జైలుకు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు.
నాటు సారా, బెల్లం స్వాధీనం
కొత్తగూడెంఅర్బన్: వాహనాల తనిఖీల్లో భాగంగా కొత్తగూడెం – హేమచంద్రాపురం రోడ్డులో గురువారం కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ టీం ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈనేపథ్యాన టేకులపల్లి మండలం 9వ మైల్‌తండాకు చెందిన ఇస్లావత్ రవి తన బైక్‌పై వెళ్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. దీంతో అతడి వద్ద 25 కేజీల బెల్లం, 2 కేజీల పట్టిక, 2 లీటర్ల నాటు సారాయి లభించడంతో వాటితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌతమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రామకృష్ణగౌడ్, రమేష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌మేళాలో 10 మందికి ఉద్యోగాలు


