కత్తితో యువకుడు హల్‌చల్..
టేకులపల్లి: భూ తగాదాల నేపథ్యాన ఓ యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడు. అందరినీ చంపేస్తానని బెదిరించడంతో పాటు బైక్‌లు, ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశాడు. టేకులపల్లి ఎస్‌ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం దాసుతండా పంచాయతీ సింగ్యతండాకు చెందిన హమాలీ వర్కర్ బోడ వెంకన్న తన బంధువైన బోడ గన్నాకు భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యాన గురువారం సాయంత్రం గన్నా ఇంట్లో లేని సమయాన వెంకన్న కత్తితో వారి ఇంట్లోకి వెళ్లి గన్నా భార్య రజితను దుర్భాషలాడడంతో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానని బెదిరించారు. అంతేకాక ఇంట్లోని కుర్చీలు, వాషింగ్ మిషన్, తలుపులను, బయట ఉన్న భూక్య లక్ష్మణ్, గుగులోత్ శ్రీను, బోడ గన్నాలకు చెందిన బైక్‌లను ధ్వంసం చేశాడు. దీంతో స్థానికులు 100కు డయల్ చేయగా.. టేకులపల్లి పోలీసులు వచ్చి వెంకన్నను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. బోడ రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
దమ్మపేట: కుటుంబ కలహాల నేపథ్యాన మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్మ చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిద్దె వెంకటలక్ష్మి(28)కి, ఆమె భర్తకు ఇటీవల కాలంలో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆమె క్షణికావేశంలో ఇంటి వెనుక ఉన్న చెక్క దులానికి చున్ని సాయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.
వేధింపులు భరించలేక మరొక వివాహిత..
కొణిజర్ల: బావ వరస అయ్యే వ్యక్తి లైంగికంగా వేధిస్తుండడంతో తట్టుకోలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొణిజర్ల ఎస్‌ఐ జి.సూరజ్ వెల్లడించిన వివరాలు... కూసుమంచి మండలం శుక్రవారపుపేటకు చెందిన కానిస్టేబుల్ షేక్ సయ్యద్‌కు మండలంలోని లాలాపురం వాసి షేక్ ఆశాబీ(34)తో వివాహం జరిగింది. అయితే, ఆశాబీని బావ వరస అయ్యే వైరా వాసి షేక్ రహీమ్ కొంతకాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంలో రహీమ్ భార్య జైబూబీ కూడా ఆశాబీని తప్పుపడుతూ ఆమె ఫొటోలు బయటపెడతానని బెదిరించింది. దీంతో వేదనకు గురైన ఆశాబీ ఈనెల 7న లాలాపురం వచ్చి గురువారం పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె తండ్రి ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై ఆశాబీ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


