వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
● కారు ఢీకొని ఒకరు..
సత్తుపల్లిరూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేటకు చెందిన మేధమంచి వరప్రసాద్(65) ద్విచక్రవాహనంపై గురువారం వస్తుండగా సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు.
● బైక్ అదుపుతప్పి మరొకరు..
టేకులపల్లి: సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన అత్తగారింటికి వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పిన మృతిచెందాడు. బోడు ఎస్‌ఐ పోలిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం. కొత్తగూడెం బూడిదగడ్డకు చెందిన గొగ్గెల పెద్దిరాజు(31)కు టేకులపల్లి మండలం బర్లగూడెంకు చెందిన రేష్మాతో ఆరేళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఒక పాప ఉంది. అయితే సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న పెద్దిరాజు బుధవారం ఉదయం బర్లగూడెంలోని అత్తగారింటికి వెళ్లి అదే రోజు రాత్రి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈక్రమంలో బర్లగూడెం–ఒడ్డుగూడెం మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోగా.. రాత్రంతా ఎవరూ గమనించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొత్తగూడెంకు తరలించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
● ట్రాక్టర్ బోల్తాపడి ఇంకొకరు..
ములకలపల్లి: మండలపరిధిలోని తాళ్లపాయ జీపీ పరిధిలో గురువారం ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై మధుప్రసాధ్ కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామానికి చెందిన సిద్దెల ప్రసాద్ తన కొడుకు సిద్దెల వంఽశీ (23)ని ట్రాక్టర్‌పై ఎక్కించుకొని వెంకటాపురం వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో తాళ్లపాయ జీపీ పరిధిలోని రింగిరెడ్డిపల్లి శివారులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడగా వంశీ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 108లో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, ఆపై ఖమ్మం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య గీతాంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


