కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌కు ప్రమాదం
జూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు గ్రామ సమీపాన గురువారం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. చీపురుగూడెం గ్రామానికి చెందిన సుమారు 30 మంది మహిళా కూలీలు పత్తి తీసేందుకు ట్రాక్టర్‌లో భేతాళపాడు గ్రామం మీదుగా వెళ్తున్నారు. ఈక్రమంలో పొలాలకు వెళ్లే దారి బురద, గుంతలతో ఉండడంతో ట్రాక్టర్ ట్రక్కు బురదలో ఇరుక్కుని పక్కకు ఒరిగింది. దీంతో ట్రక్కులోని మహిళా కూలీలు పడిపోగా.. 8 మందికి గాయాలయ్యాయి. ఇందులో మూడు నెలల గర్భిణి సోడె సుస్మితతో పాటు వజ్జా విజయలక్ష్మి, వజ్జా రమాదేవి, మూతి రజిత, కీసర ఉదయశ్రీ, బచ్చల అనసూయ, బొర్రా మంగమ్మ, కోరం లక్ష్మి ఉండగా.. స్థానికులు వీరిని 108లో కొత్తగూడెం ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్‌ఐ బాదావత్ రవి ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను సేకరించారు. అలాగే భేతాళపాడు సర్పంచ్ గుగులోత్ సునీత, మహేష్ దంపతులు క్షతగాత్రులను పరామర్శించారు. ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడకుండా పక్కకు ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది.
8 మంది మహిళా కూలీలకు గాయాలు


