సర్కార్ బడులకు కంప్యూటర్లు అందజేత
చర్ల(దుమ్ముగూడెం): దుమ్ముగూడెం మండలం సింగవరం గ్రామపంచాయతీ పరిధి పెద్దపాడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మళల్ల మోహన్‌కుమార్ చొరవతో ఆయన స్నేహితులు మండలంలోని ఐదు పాఠశాలలకు రూ.లక్ష విలువైన నాలుగు కంప్యూటర్లు, ఒక ల్యాప్‌టాప్ అందజేశారు. భద్రాచలంలోని మండల విద్యావనరుల కేంద్రంలో గురువారం డీఈఓ బి.నాగలక్ష్మి చేతుల మీదుగా వీటిని దుమ్ముగూడెం మండలంలోని పెద్దపాడు, కొమ్మనాపల్లి, ములకపాడు, చిన నల్లబల్లి, తూరుబాక గ్రామ పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మోహన్‌కుమార్ తన మిత్రులైన మూర్తి, బ్రహ్మచారి, ఎం.సాయిసన్వి, సాయిరాం, ఎ.నరేష్‌కుమార్, కె.బాలప్రసాద్, ఎం.యాదగిరి, ఎ.రాజు, జి.శివకుమార్, ఎన్.ప్రకాశ్, జి.ప్రవీణ్‌కుమార్, వెంకటరమణ, బాలాజీ సహకారంతో కంప్యూటర్లు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమాదేవి, దుమ్ముగూడెం కాంప్లెక్స్ హెచ్‌ఎం కోటీశ్వరి తదితరులు పాల్గొన్నారు.


