డీలర్ల మాయాజాలం
● పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ● రెండు చౌక దుకాణాలు సీజ్ ● ఇల్లెందులో విజిలెన్స్ దాడులు
ఇల్లెందు: ప్రభుత్వం పేదలకు రేషన్ పంపిణీ చేస్తుండగా, దాన్ని సక్రమంగా చేరవేయాల్సిన డీలర్లు మాయాజాలం సృష్టిస్తున్నారు. తాజాగా ఇల్లెందులో ‘స్టేట్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్’ విభాగం సోదాలు చేసింది. ఈ సోదాల్లో రెండు షాపుల్లో 156 క్వింటాళ్ల బియ్యం తక్కువ ఉన్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు సిక్స్–ఏ కేసు నమోదు చేసి, ఆ రెండు షాపులను సీజ్ చేశారు. పట్టణంలోని ఇల్లెందులపాడు రేషన్‌షాపు నం. 3020045లో 68 క్వింటాళ్లు, నం.3020016 షాపులో 88 క్వింటాళ్ల బియ్యం తక్కువ ఉన్నట్లు తనిఖీలో వెల్లడైంది. దీందో ఈ రెండు షాపులను సీజ్ చేసి ఒక షాపును కటకం దయాకర్‌కు, మరో షాపును జీసీసీ సేల్స్‌మెన్ యాకయ్యకు అప్పగించారు. వీటితో పాటు నంబర్ –2 బస్తీలో ఒక రేషన్ షాపు, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో రెండు షాపులను తనిఖీ చేశా రు. స్టేట్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్ ఓఎస్‌డీ అంజయ్య, రిటైర్డ్ తహసీల్దార్ కమాల్‌పాషా, ఇల్లెందు సివిల్ సప్లై విభాగం డీటీ ఎస్. రాంబాబులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఈ నెల రేషన్ పంపిణీ అయిన వారం రోజుల్లోనే రెండు షాపుల్లో 156 క్వింటాళ్లు మాయమయ్యాయంటే డీలర్లు ఏ స్థాయిలో బియ్యం అక్రమ దందా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.


