నవమి నాటికి గిరిజన మార్ట్
భద్రాచలం: ప్రకృతిలో గిరిజనులకు లభించే వస్తువులన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఒక్క చోటనే లభించేలా శ్రీరామనవమి నాటికి గిరిజన మార్ట్‌లు అందుబాటులోకి తెస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. తన చాంబర్‌లో మంగళవారం ఆయన డీఆర్డీఏ, ఐటీడీఏ, ఐటీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖమ్మంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు ఏర్పాటుచేసిన షాపింగ్ మాల్‌పై వివరాలు ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. కొనుగోలుదారులను ఆకట్టుకునేలా భద్రాచలంలోని జీసీసీ గిరిజన బజార్‌ను సరికొత్తగా డిజైన్ చేయాలని ఈఈ మధుకర్‌ను ఆదేశించారు. జిల్లాలోని రైతులు పండించే పంటల వివరాలు సేకరించాలని వ్యవసాయాధికారి ఉదయ్‌కుమార్‌కు సూచించారు. గిరి మాల్‌లో వస్తువులు అమర్చేందుకు అవసరమైన ఫర్నిచర్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శ్రీరామనవమి నాటికి గిరి మార్ట్ ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలంలోని గిరి బజార్‌ను సందర్శించి గిరి మార్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలపై చర్చించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, జీసీసీ డీఎం సమ్మయ్య, ఐటీసీ డీఎం చంగల్ రావు, డీఈ హరీష్, టీఏ శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి కథనానికి పీఓ రూపం
ఖమ్మంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌ను స్ఫూర్తిగా తీసుకుని గిరిజనులకు లభించే వస్తువులన్నింటినీ ఒకేచోట విక్రయించేలా గిరిజన మార్ట్‌ను భద్రాచలంలో ఏర్పాటు చేయాలని సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. తద్వారా భద్రాచలం వచ్చే పర్యాటకులను, భక్తులకు అటవీ ఉత్పత్తులను పరిచయం చేయడంతో పాటుగా గిరిజనులకు ఉపాధి లభిస్తుందని పేర్కొంది. గిరిజనుల ఆహార ఉత్పత్తులు, వెదురు వస్తువులు అన్నింటినీ ఒకేచోట చేరిస్తే అంతర్జాతీయ స్థాయిలో గిరిజన ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుందని పేర్కొనడంతో స్పందించిన పీఓ రాహుల్ గిరిజన మార్ట్ ఏర్పాటు పనులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘సాక్షి’ కథనానికి పీఓ స్పందన


