రమణీయంగా రామయ్య రాపత్తు సేవ
● విశ్రాంతి మండపంలో ప్రత్యేక పూజలు ● వైభవంగా దొంగల దోపు ఉత్సవం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామయ్యకు మంగళవారం విశ్రాంతి మండపంలో రాపత్తు సేవను రమణీయంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారిని కల్కి అవతారంలో అలంకరించారు. కోలాటాలు, వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ తీసుకొచ్చి విశ్రాంతి మండపంలో కొలువుదీర్చారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించారు. అనంతరం తాతగుడి సెంటర్‌లో దొంగల దోపు వేడుకను నేత్రపర్వంగా జరిపించారు.
కమనీయంగా నిత్య కల్యాణం
దేవస్థానం ప్రాంగణంలో రామయ్య నిత్యకల్యాణ వేడుకను మంగళవారం కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.


