ఇక మెరుగైన వైద్యం !
కష్టాలు తీరే అవకాశం..
రెండు పీహెచ్‌సీల అప్‌గ్రేడ్‌కు పరిశీలన
● అన్నపురెడ్డిపల్లిలో సీహెచ్‌సీ ఏర్పాటుకు ప్రతిపాదనలు ● ప్రభుత్వానికి నివేదిక అందజేత.. ఇక మంజూరే తరువాయి
ఇల్లెందు: జిల్లాలో రెండు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు అన్నపురెడ్డిపల్లిలో నూతన సీహెచ్‌సీ, డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ముగ్గురు అధికారులతో కూడిన జిల్లా స్థాయి బృందం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. గత డిసెంబర్ 1వ తేదీన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్(టీవీవీపీ) నుంచి కలెక్టర్‌కు అందిన లేఖ మేరకు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌తో కూడిన ప్రతినిధి బృందం గుండాల, కరకగూడెం, అశ్వాపురం పీహెచ్‌సీలను పరిశీలించింది. ఆయా పీహెచ్‌సీల్లో గలసౌకర్యాలు, సీహెచ్‌సీ ఏర్పాటుకు గల అవకాశాలను వివరిస్తూ ముగ్గురు సభ్యులు అదే నెల 16న వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు నివేదిక అందజేశారు. కరకగూడెం పీహెచ్‌సీకి 30 కిలోమీటర్ల దూరంలో, గుండాలకు 60 కి.మీ.దూరంలో డయాలసిస్ సెంటర్లు ఉన్నా యి. అన్నపురెడ్డిపల్లికి అశ్వారావుపేట 60కి.మీ., సత్తుపల్లి 30 కి.మీ., పాల్వంచ 35 కి.మీ., కొత్తగూడెం 40 కి.మీ. దూరంలో ఉన్నాయి. అశ్వాపురం పీహెచ్‌సీ మణుగూరు 100 పడకల ఆస్పత్రికి సమీపంలో ఉంది. దీంతో గుండాల, కరకగూడెంతో పాటు అశ్వాపురానికి బదులు అన్నపురెడ్డిపల్లిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని నివేదికలో కోరారు. అంతేకాక కరకగూడెం, గుండాల, అన్నపురెడ్డిపల్లి పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అప్ గ్రేడ్ చేయాలని, అందుకు అవసరమైన సదుపాయాలు కూడా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు.
గుండాల, కరకగూడెం పీహెచ్‌సీలను సీహెచ్‌సీలు గా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు అన్నపురెడ్డిపల్లిలో సీహెచ్‌సీ ఏర్పాటు చేస్తే ఏజెన్సీ వాసుల వైద్య కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల లేఖలు, అధికారుల నివేదికలను ప్రభుత్వంపరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందిస్తే మెరుగైన సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.


