సురక్షిత ప్రయాణం అందరి బాధ్యత
సూపర్‌బజార్(కొత్తగూడెం): సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందన్ అన్నారు. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతా అభియాన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు నుంచి పోస్టాఫీస్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ఇది కేవలం జరిమానాల కోసం కాదని, ప్రాణ రక్షణ కోసమని అన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని హెచ్చరించారు. వారం రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, నిరంజన్ రావు, పావని, పీపీ రాజారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్, భిక్షమయ్య, జానకీరామ్, రాజమణి, షాహిన్, వీరభద్రం పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
రాజేందర్


