బ్యాంకుల్లో పటిష్ట భద్రత ఉండాలి
ఎస్పీ రోహిత్ రాజు
సూపర్‌బజార్(కొత్తగూడెం): బ్యాంకులకు సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజు బ్యాంకర్లకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏటీఎం, బ్యాంకు చోరీ ల నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకుల లోపల, వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. సెక్యూరిటీ అలారం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామాజిక బాధ్యతతో సైబర్ నేరాలపై బ్యాంకులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన నగదును త్వరితగతిన బాధితులకు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాల్వంచరూరల్/భద్రాచలంటౌన్: ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాల్లో 6 నుంచి 9 తరగతి వరకు అడ్మిషన్లు కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు పాల్వంచ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అన్వేష్, భద్రాచలం గిరిజన గురుకులం ప్రిన్సిపాల్ ఎస్.హేమలత సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు బదులుగా ఇతరుల ఫొటోలతో దరఖాస్తు చేస్తే 416 ఆఫ్ ఐపీసీ 1860 ప్రకారంక్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బయోచార్‌పై
ఉచిత శిక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని రైతులకు ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణుడు పరశురాం కై లాస్ అఖరే ఆధ్వర్యంలో బయోచార్‌పై ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి గరిమెళ్లపాడు నర్సరీలో, బుధవారం ఉదయం 9.30 గంటలకు అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 94927 31222, 92814 79565 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


