సీఎం కప్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీఎం కప్ క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోటీల నిర్వహణపై సోమవారం క్లస్టర్ ఇన్‌చార్జీలు, ఎంఈఓలు, డీఈఓ, డీపీఓ, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీస్థాయిలో ఈ నెల 17 నుంచి 22 వరకు, మండలస్థాయిలో ఈ నెల 28 నుంచి 31 వరకు, నియోజకవర్గస్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు, రాష్ట్రస్థాయిలో, మొత్తం ఐదు దశల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామీణ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో క్రీడలు నిర్వహించాలని చెప్పారు. ఎంఈఓలు, సీఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో 21 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు వివరాలను అధికారిక వెబ్‌సైట్ satg. telangana. gov. in/ cmcup లేదా CM cup మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


